29 ఎస్‌బిఐ బ్రాంచీలలో బాండ్ల జారీ
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ఎలెక్టోరల్ బాండ్ల 21వ విడత అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి జులై 10వ తేదీ వరకు ఎలెక్టోరల్ బాండ్ల జారీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రాజకీయ పార్టీలకు నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలెక్టోరల్ బాండ్లను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎలెక్టోరల్ బాండ్ల జారీకి, వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ)కు మాత్రమే అధికారం ఉంది. ఎస్‌బిఐకి చెందిన 29 శాఖలలో జులై 1నుంచి వీటి అమ్మకాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్‌కత, గువాహటి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయపూర్, ముంబైతోసహా 29 ఎస్‌బిఐ శాఖలలో వీటి జారీ ఉంటుంది. జారీ చేసిన నాటి నుంచి 15 రోజుల పాటు ఎలెక్టోరల్ బాండ్ చెల్లుబాటులో ఉంటుంది. గడువు తేదీ ముగిసిన తర్వాత వీటిని డిపాజిట్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి చెల్లింపు జరగదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.