డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: కొవిడ్-19పై తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు తాజా ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే దాన్ని తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని సోషల్ మీడియా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్రం నుంచి తాజా మార్గదర్శకాలు తమకు అందాయని కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తెలిపాయి. కరోనా వైరస్‌కు చెందిన బి.1.617 వేరియంట్ విషయంలో ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ) ఎక్కడా పేర్కొనలేదని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు శుక్రవారం రాసిన ఒక లేఖలో ఐటి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌కు చెందిన ఇండియన్ వేరియంట్ వివిధ దేశాలలో వ్యాప్తి చెందుతోందని పేర్కొంటూ తప్పుడు ప్రకటన ఆన్‌లైన్‌లో ప్రచారమవుతోందని ఐటి శాఖ తెలిపింది.