కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న 20 యుట్యూబ్ చానళ్లు, 2 వెబ్‌సైట్లపై వేటు వేసినట్ల్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంగళవారం తెలిపింది. నిఘా సంస్థలతో సమన్వయం చేయడం ద్వారా తాము ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. 20 చానళ్లను బ్లాక్ చేయాలని వీడియోలను షేర్ చేసే యుట్యూబ్‌కు ఒక ఉత్తర్వును, న్యూస్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ మరో ఉత్తర్వును సోమవారం మంత్రిత్వశాఖ జారీచేసింది. పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తూ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న చానళ్లు, వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కశ్మీరు, భారత సైన్యం, భారత్‌లోని మైనారిటీ వర్గాలు, రామ మందిరం, జనరల్ బిపిన్ రావత్ మొదలైన అంశాలపై ఒక సమన్వయంతో ఈ చానళ్లు, వెబ్‌సైట్లు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని తెలిపింది. పాకిస్తాన్ నుంచి పనిచేసే నయా పాకిస్తాన్ గ్రూపు ద్వారా ఈ తప్పుడు వార్తల వ్యాప్తి జరుగుతోందని, ఎన్‌పిజికి కొన్ని యుట్యూబ్ చానళ్లు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.