న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జిఎస్‌టి వ్యవస్థను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శనివారం ప్రకటన వెలువరించారు. ఈ పరిణామంతో జిఎస్‌టి విషయంలో అవకతవకలపై , ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మరింతగా నేరుగా పిఎంఎల్‌ఎ పరిధిలో చర్యలు తీసుకునేందుకు వీలేర్పడుతుంది.
తప్పుడు మార్గాలలో జిఎస్‌టి రాయితీలు పొందడం, నకిలీ ఇన్వాయిస్ వంటి జిఎస్‌టి నేరాలను ఇక పిఎంఎల్‌ఎ పరిధిలో విచారించేందుకు అవకాశం ఉంటుంది. ఇడి ఇతర కేంద్రీయ సంస్థలు ఎక్కడైనా ఏ సంస్థ అయినా జిఎస్‌టి వ్యవస్థను కాదంటూ వ్యవహరించినట్లు భావిస్తే మనీలాండరింగ్ చట్టం పరిధిలో వ్యవహరించేందుకు , వారిని శిక్షించేందుకు, విచారణ జరిపేందుకు వీలేర్పడుతుంది. ఇడి ఇప్పుడు పలు కేసులకు సంబంధించి చేపట్టిన ఆర్థిక అక్రమాలపై విచారణల సంబంధిత వ్యవహారాలలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని జిఎస్‌టి అధికారిక మండలితో పంచుకోవచ్చు. ఇదే దశలో జిఎస్‌టి వ్యవస్థ నుంచి ఇడి కోరిన విషయాలు పిఎంఎల్‌ఎ పరిధిలో అందించడానికి వీలేర్పడుతుంది.