ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం? నిజం చెప్పు కళా రవి, కవీ అన్నాడు శ్రీశ్రీ. అవును శ్రీశ్రీ అన్నట్లు తెలంగాణలో పచ్చగా కనిపిస్తున్న ఊరు నిజం. అవును తెలంగాణలో గురుకులాలు కార్పొరేట్ కాలేజీల స్థాయిలో బహుజన సంచార జాతుల బిడ్డలకు నాణ్యమైన చదువును అందిస్తున్నది నిజం. వృద్ధులకు వచ్చే పెన్షన్‌తో, ఒంటరి మహిళలకు అందే పెన్షన్ సాయంతో వాళ్ళు ఆత్మగౌరవంతో నిలిచింది నిజం. మన ఊరు చెరువు నిండుకుండలా నిలిచి ఎండా కాలంలో కూడా అలుగులు దూకటం కళ్ళముందటి నిజం. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగింది. పల్లె, పట్నం దవాఖానాలు పేదలకు మెరుగైన సేవల దగ్గర్నుంచి అత్యవసరం సేవల వరకు అందిస్తున్నది ప్రజల సాక్షిగా నిజం. తెలంగాణ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎగువ భూములకు నీళ్ళు ప్రవహించింది పచ్చి నిజం. పాలమూరు పచ్చబడ్డది చెట్టు సాక్షిగా, పుట్ట సాక్షిగా పచ్చిక బాగా పెరిగిన గుట్టల సాక్షిగా నిజం. ఎన్నికల వేళ ఎవరెన్ని కారుకూతలు కూసినా హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతుంది ముమ్మాటికీ నిజం. పిల్లలు దుర్గం చెరువు దగ్గర కేబుల్ వైర్ బ్రిడ్జి ప్రభుత్వమే నిర్మించింది నిజం కాదా?
హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జిల దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జిలు ఆకాశ హర్మ్యాల నుంచి బహుళ అంతస్తుల భవనాల హైటెక్ సిటీ విస్తరించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా మన తెలంగాణ ప్రగతి బావుటా పతాకమే కదా? దీన్ని కాదంటారా, ఇది నిజం కాదా, నిజంగా హైదరాబాద్ నాలెడ్డ్ సెంటర్‌గా, శాస్త్రసాంకేతిక రంగాల కేంద్రంగా, ఐటి హబ్‌గా విరాజిల్లుతున్న కళ్ళముంగటి సత్యం కాదా? అవును పెరుగుతున్న నగరంతో పాటే పల్లెలు కూడా ప్రగతి బాటన పచ్చబడటం నిజం కదా? పల్లెలు సొంతకాళ్ళపై నిలబడి స్వతంత్రంగా ఎదుగుతూ రావటమంటే 90 శాతంగా వున్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, ఆదివాసీ బిడ్డల భవిష్యత్ కు బాట కాదా? సంచార జాతుల బిడ్డలు గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను మించి నాణ్యమైన చదువును పొంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, వివిధ రంగాలకు ఎదిగి విశ్వాంతరాల వరకు వెళ్ళడం కదా అసలు నిజం, అసలు ప్రగతి.
అవును గతం పేజీలు కూడా తిరగేసి చూడండి. ప్రజలను గత పాలకులు ఏం చేశారో, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటో తేటతెల్లంగా తెలుసుకోవటం కదా అసలు నిజం. తెలంగాణ రాకముందు వరకు ఇప్పుడు గొంతెత్తి అబద్ధాలు మాత్రమే మాట్లాడే పెద్దలు కదా ఏలుబడి చేసింది. ఆ నిజాలు ఒప్పుకోరా? ఈ కాంగ్రెస్ వాళ్ళు కదా బూటకపు మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతూ ఎన్నికలప్పుడు మేనిఫెస్టోల తాయిలాలు చూపించి అధికార పీఠాలను అలంకరించింది నిజం కాదా, చెప్పండి. తెలంగాణ రాకముందు ఏలికలు తెలంగాణలో చేసింది విధ్వంసమే కదా? వాళ్ళు అయితే గియితే చేసింది ఏమిటంటే బూటకపు మాటలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, పత్తిరైతుల ఆత్మహత్యల పంటలు కదా పండించింది. పత్తి పంటకు పట్టిన పచ్చపురుగులాగా పచ్చటి తెలంగాణను ధ్వంసం చేసింది ఎవరు? తిరిగి వీళ్ళే అధికార పీఠాలు కోల్పోయాక గ్యారంటీ పథకాలతో ముందుకు వస్తే నిత్య చైతన్య తెలంగాణ ఒప్పుకోదన్నది నిజానికి నిజం లాంటిది.
స్తంభాద్రి సాక్షిగా ఖమ్మం ఖిల్లా మీద ఒట్టేసి చెప్పండి. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించుకున్న అపర భగీరథ ప్రయత్నం సాచ్ఛికంగా చెప్పండి. నల్లగొండ, ఎర్రకొండ, రాచకొండ గుట్టల సాక్షిగా, పాలమూరు సోమశిల సాక్షిగా మూడు నదుల సంగమ ప్రదేశం సాక్షిగా, తుంగతుర్తి, సూర్యాపేటలను తాకిన కాళేశ్వరం జలాల సాక్షిగా, దక్షిణ తెలంగాణలో నాలుక తడుపుకుని బీడు భూములు పచ్చబడ్డ సాక్షిగా చెప్పండి. తెలంగాణను ఏడు దశాబ్దాలు నిర్వీర్యం చేసింది ఈ కాంగ్రెస్, కాంగ్రెసేతర పార్టీ కాదా? ఆదిలాబాద్ నుంచి మెదకు వరకు, మంచిర్యాల మందమర్రి నుంచి కొత్తగూడెం, ఇల్లందు, బయ్యారం అడవుల వరకు తెలంగాణ రాక ముందు వరకు తుపాకుల మోతల బూటకపు ఎన్‌కౌంటర్ల నెత్తురు ముద్దల వార్తలే కదా? ఉత్తర తెలంగాణలో నేలకొరిగిన వీరుల నెత్తురు సాక్షిగా దుష్ట పాలనలను కొనసాగించిన పార్టీలు ఇప్పుడు సుస్థిర పాలనను అందిస్తారంటే గాయపడ్డ తెలంగాణ ఎట్ల నమ్ముద్ది చెప్పండి. ఒక ముఖ్యమంత్రిని గద్దె దించటానికి హైదరాబాద్‌ను మత కలహాల కేంద్రంగా మార్చి విధ్వంసాలు సృష్టించిన పార్టీలు ఎవరివో ప్రజలు గమనించలేరా?
తెలంగాణ జన జీవనానికి బతుకు గ్యారెంటీ లేకుండా చేసి ఇపుడు ఎన్నికల కోసం గ్యారెంటీ పథకాలతో వస్తున్న మిమ్మల్ని, మీరు మాట్లాడుతున్న అసత్యాలను ప్రజలు నమ్మరు గాక నమ్మరు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాకముందు ధ్వంసం చేసిన మీరే తిరిగి తెలంగాణ పునర్నిర్మాణానికి గత 10 సంవత్సరాలుగా ప్రతి పనికి ఆటంకాలు కల్పిస్తూ, కోర్టుల్లో కేసులు వేస్తూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంది కూడా ప్రజలు గమనించగలరు. ప్రగతిని అడ్డుకున్న వారికి ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉండదు. తెలంగాణ ఆచరణ మాత్రమే చూస్తుంది. అబద్ధాలను, అసత్యాలను ఒప్పుకోదు. గత పదేళ్ళ తెలంగాణ పాలనకు కెసిఆర్ దార్శనిక దృష్టి ఉంది. కెసిఆర్ ఆలోచనల ధారల్లో ఉద్యమ వేగంతో జరిపిస్తున్న పునర్నిర్మాణం ఉంది. తెలంగాణను అన్నింటిలో గెలిపిస్తూ ముందుకు సాగుతున్న కెసిఆర్ ఓడిపోరు. కెసిఆర్ ఒక్కడి రూపంలో వున్న మహా జనరూపం. ఈ బక్క మనిషే బడుగుల కోసం నిలిచే బాహుబలి.