ఎల్‌పిజి ధర పెంపుపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశంలో గృహ వినియోగ వంటగ్యాస్(ఎల్‌పిజి) ధరను మళ్లీ పెంచుతూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమంటూ కాంగ్రెస్ అభివర్ణించింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇంటి బడ్జెట్‌పై ధరల పెంపు అనే బుల్‌డోజర్‌ను ప్రయోగిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ సృష్టించిన ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మే నెల నుంచి మూడవ సారి వంటగ్యాసు ధరను మరో రూ. 50 పెంచిందని కాంగ్రెస్ తెలిపింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణం, భారత రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ మీడియాలో పతాక శీర్షికలను మేనేజ్ చేశారు కాని ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు అంటూ ట్వీట్ చేశారు. కాగా..కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ఎల్‌పిజి సిలిండర్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ధజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర వరుసగా పడిపోతూనే ఉందని, కాని కేంద్రం మాత్రం ఎల్‌పిజి ధరను పెంచుకుంటూ పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.