పణాజీ: గోవాలోని ఒక బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అరెస్టయిన ప్రభుత్వ ఉద్యోగిని సర్వీసు నుంచి సస్పెండ్ చేసినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గురువారం రాష్ట్ర శాసనసభలో తెలిపారు. గోవా రాజధాని పణాజీకి 30 కిలోమీటర్ల దూరంలోని బెనోలిమ్ బీచ్‌కు గత ఆదివారం ఇద్దరు మగపిల్లలతో కలసి ఇద్దరు మైనర్ బాలికలు వెళ్లగా తాము పోలీసులమంటూ నలుగురు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ ఇద్దరు మగపిల్లలను చితకబాది ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ నలుగురిలో వ్యవసాయ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకడు ఉన్నాడు. ఆ నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఉద్యోగిని సర్వీను నుంచి డిస్మిస్ చేసే ప్రక్రియ సాగుతున్నట్లు ముఖ్యమంత్రి గురువారం అసెంబ్లీలో తెలిపారు.
కాగా, బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అర్ధరాత్రి వరకు ఆడపిల్లలు బీచ్‌లో తిరుగుతుంటే వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటూ సావంత్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 14 ఏళ్ల తమ పిల్లలు రాత్రంతా బీచ్‌లో గడుపుతుంటే వారి తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని, పిల్లలు తమ మాట వినరన్న సాకుతో నిందను పోలీసులపైన, ప్రభుత్వంపైన వేయడం సరికాదని బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సావంత్ వ్యాఖ్యానించారు. తమ పిల్లల భద్రత గురించి ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉందని, తమ పిల్లలను, ముఖ్యంగా మైనర్లను రాత్రి పూట బయటకు పంపడం తగదని ఆయన సూచించారు.