ఒపిఎస్ కోసం మూకుమ్మడి సెలవులు
అహ్మదాబాద్ : గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శనివారం ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సామూహిక సెలవు తీసుకుని , ధర్నాలు నిర్వహించారు. పెన్షన్ స్కీంకు సంబంధించి ఉద్యోగుల సమ్మె సాగుతోంది. అయితే చర్చలు ఫలించాయని, సమ్మె విరమించినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించినా , దీనిని బేఖాతరు చేస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున శనివారం పలు ప్రాంతాలలో ధర్నాలు నిర్వహించారు. వేలాది మంది ప్రభుత్వోద్యోగులు సామూహిక సెలవులకు దిగడంతో కార్యాలయాలు, విద్యాసంస్థలు వెలవెలబొయ్యాయి. పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని ఓ వైపు సంఘాల నాయకులు ప్రకటన వెలువరించారు.
సమ్మె విరమిస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని డిమాండ్లను ఆమోదించి ఉంటారని అయితే తమ ప్రధాన డిమాండ్ మేరకు పాత పింఛన్ పథకం(ఒపిఎస్) కొనసాగించాల్సి ఉందని , ఇది నెరవేరే వరకూ తాము సమ్మెలోనే ఉంటామని ఉద్యోగులు తెలిపారు. డిమాండ్ల సాధనకు పలు ప్రభుత్వ విభాగాల ఉద్యోగ సంఘాల తరఫున సంయుక్త కర్మచారి మోర్చా సారథ్యంలో ఉద్యోగులు మూకుమ్మడి సిఎల్ తీసుకుంటున్నారు. అయితే శుక్రవారం సంయుక్త ఉద్యోగ సంఘాల నేతలు దిగ్విజయ్ సిన్హ్ జడేజా, భికాభాయ్ పటేల్ ఐదుగురు మంత్రులతో భేటీ అయి, డిమాండ్లు నెరవేరాయని తెలిపి సమ్మె నిలిచిపోతుందని తెలిపారు. అయితే సమ్మె ఇప్పటికీ కొనసాగుతూ ఉండటంతో పరిపాలనాపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి.