మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: జిల్లా కేంద్రానికి హరిత శోభ రానుందని, వనపర్తిలో టూరిజం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హరిత ప్లాజా హోటల్‌లో చిన్న పిల్లల ఆట స్థలం, రెస్టారెంట్, బంక్వెట్ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రానికి తాజాగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుతో జిల్లాకు సందర్శకుల రాకపోకలు ఎక్కువయ్యాయని మంత్రి తెలిపారు.
వనపర్తి జిల్లా ఏర్పాటు తరువాత వివిధ వ్యాపార షోరూంలు ఏర్పాటు, సాగునీటి రాకతో పంట ఉత్పత్తులు పెరిగాయని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో విశ్రాంతి భవనాల కొరత ఉందని, హరిత హోటల్ నిర్మాణంతో పర్యాటకులు, వ్యాపార వర్గాలకు ఆ కొరత తీరనుందని అన్నారు. సర్వే నంబరు 411లో 6.24 ఎకరాల భూమిలో హరిత ప్లాజా హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో నిధులు మంజూరు చేయించి హోటల్ నిర్మాణం పనులు వేగవంతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.