Monday, December 23, 2024

రేషన్‌కార్డుల జారీకి రెడీ

- Advertisement -
- Advertisement -

పెండింగ్ దరఖాస్తులకు త్వరలో మోక్షం
రేషన్ కార్డుల కోసం దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తు
సంక్రాంతి తర్వాత కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు
ఈ నెలాఖరులోగా కొత్త కార్డుల అర్హతలు..మార్గదర్శకాలు
ఎలక్ట్రానిక్ చిప్‌తో కొత్త రేషన్ కార్డులు జారీ
సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు : పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో రేషన్‌కార్డుల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతో కూడిన ఎలక్టానిక్ చిప్‌తో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా కొత్త కార్డుల అర్హతలు, మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండటంతో కార్డుల మంజూరులో ప్రభుత్వం ఫిర్యాదులకు అవకాశం లేకుండా వ్యవహరించాలని సిద్ధమైంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు పై కసరత్తు వేగవంతం చేసింది. అత్యాధునిక సాంకేతికతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హాయంలో రెండున్నరేళ్ల క్రితం అప్పుడు దరఖాస్తులను ఆహ్వానించి లబ్దిదారులకు నాటి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఆ తరువాత తిరిగి అర్హత ఉన్న వారు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుకు నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల ఖరారు పైన కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల దరఖాస్తులు కొన్ని నెలలుగా పెండింగులో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత వారిలో ఎంత మందికి కార్డులు దక్కుతాయన్నది స్పష్టత వస్తుందని అంటున్నారు. సుమారు రెండున్నరేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించి అర్హులకు కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత నుంచి కార్డులు జారీ చేసిన దాఖలాలు లేవు. గతంలో కార్డుల జారీ ప్రక్రియ తరచుగా జరిగేది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తోంది.

అధికశాతం హైదరాబాద్‌లోనే : రేషన్ కార్డుల కోసం సుమారు 4.5 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు అధికారుల అంచనాలు వేస్తున్నారు. అధిక శాతం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. కొత్తగా జారీ చేసే కార్డులో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ చిప్‌లో కార్డుదారుడి కుటుంబ సభ్యుల సంఖ్య, చిరునామా తదితర సమాచారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ప్రస్తుతం సుమారు 17.21 లక్షల కార్డులు ఉన్నాయి. పెండింగులో ఉన్న దరఖాస్తుల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ చిప్‌తో కొత్త రేషన్ కార్డులు : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల పైన ప్రభుత్వం తమ నిర్ణయం వెల్లడించింది. సంక్రాంతి తరువాత కొత్త కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అర్హతల ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది. రేషన్ కార్డుల్లో వినూత్నంగా ఎలక్ట్రానిక్ చిప్స్ తో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తోంది.

రేషన్ కార్డుల కోసం దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభుత్వం ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్తగా జారీ చేసే రేషన్ కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆ చిప్‌లో కార్డుదారుడి కుటుంబ సభ్యుల సంఖ్య తో పాటుగా చిరునామా తదితర సమాచారం ఉండనుంది. అధికంగా గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ప్రస్తుతం సుమారు 17.21 లక్షల కార్డులు ఉన్నట్లు అధికారుల సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6,36,617, రంగారెడ్డిలో 55,97,78, మేడ్చల్- మల్కాజ్‌గిరిలో 52,33,39లో కార్డులు ఉన్నాయి.

నిలిచిపోయిన రేషన్‌కార్డుల జారీ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 వరకు రేషన్ కార్డులను జారీ చేసింది. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. కార్డుల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకోగా వాటిని 2022లో పరిశీలించి అందులో అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేశారు. ఆ తరువాత వెబ్‌సైట్‌ను మూసివేసిన ప్రభుత్వం మళ్లీ రేషన్‌కార్డులు ఇవ్వలేదు. గత ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీ పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

2023 డిసెంబరు 9వ తేదీ నుంచి ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, చేయూత పథకంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు వైద్య చికిత్సలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు పథకాలు అమలు చేసేందుకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభల్లో ఐదు గ్యారంటీ పథకాలు వర్తింపచేసేందుకు స్వీకరించిన దరఖాస్తులతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. వీటితోపాటు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రేషన్ కార్డుల జారీకి మోక్షం కలగలేదు.

బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా : బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం నిఘా పెంచనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ప్రభుత్వం అందిస్తోంది అయితే చాలా మంది వీటిని తినకుండా బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొంతమంది ఈ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి అధిక ధరకు ఇతరులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పేదల కోసం అందించే బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈనేపథ్యంలో పేదలందరూ తినేందుకు వీలుగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తే ఈ పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలోనే తాము అధికారంలోకి వస్తే సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీ అమలు చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు : పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందచేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కొత్తగా దాదాపు 36 లక్షల మందికి రేషన్‌కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ సూచనలను పరిగణలోకి తీసు కుంటున్నామని చెప్పారు.

రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం లబ్దిదారులకు అందిస్తున్న ఆరు కిలోల బియ్యంతోపాటు సన్నబియ్యం కూడా అందించాలని నిర్ణయించినట్లు వివరించారు. రాష్ట్రంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, పజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 36 లక్షల కార్డులు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అర్హత ఉన్నవారిని గుర్తించి వారికి మాత్రమే కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News