ఒకే పథకంలో రెండు యూనిట్లు, ఎక్కువ మంది కలిస్తే పెద్ద యూనిట్
మనతెలంగాణ/హైదరాబాద్ : దళిత బంధు పథకంకు అదనపు మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. దళిత బంధు పథకాన్ని వాసాలమర్రి గ్రామంలో ఇదివరకే ప్రారంభించామని పేర్కొంది. ప్రతి కుటుంబానికి సంబంధించిన యజమాని పేరుతో దళిత బంధు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని ప్రభుత్వం సూచించింది. సంబంధిత బ్యాంకు ఖాతా పాసు పుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపింది. ఆ ఖాతాలోకి 9.90 లక్షల రూపాయలను కలెక్టర్ బదిలీ చేయాలని పేర్కొంది. దళితబంధు పథకం అమలుకు ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. లబ్దిదారులను వారు ఆసక్తి కనబరిచే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని, వ్యవసాయం -అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ- పరిశ్రమల రంగం, రిటైల్ దుకాణాలు, సేవలు -సరఫరా రంగంగా విభజించాలని ప్రభుత్వం తెలిపింది.
వ్యాపారం చేసే అంశంపై 2 నుండి ఆరు వారాల పాటు శిక్షణ పొందాలని పేర్కొంది. ఆయా రంగాల వారీగా రీసోర్స్ పర్సన్స్‌ను ఎంపిక చేయడంతో పాటు బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ.10 లక్షల యూనిట్ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రీసోర్స్ బృందాలు రూపొందించాలి. మొత్తం పది లక్షలు విలువ చేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్దిదారులు కలిసి ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్‌కు కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొంది.
లబ్ధిదారులకు శిక్షణ
రీసోర్స్ బృందాలతో కలెక్టర్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి వివిధ యూనిట్లపై అవగాహన కల్పించాలి. అవసరమైతే రీసోర్స్ బృందాలు ఎక్కువమార్లు కూడా లబ్ధిదారుల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను యూనిట్ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ల ఖరారు అనంతరం వారికి అందులో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
కలెక్టర్ సంతృప్తి చెందితేనే
ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల దృష్టా రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో అబ్ధిదారుల ఎంచుకున్న యూనిట్ల పనితీరు పరిశీలన కోసం పర్యటనలు ఏర్పాటు చేయాలని, ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్‌పై అవగాహన కలిగి, పూర్తిస్థాయిలో నడిపించేందుకు సిద్ధమైనట్లు కలెక్టర్, రిసోర్స్ బృందం సంతృప్తి చెందితే వారికి యూనిట్‌ను అందించాలని తెలిపింది. యూనిట్ మంజూరు అనంతరం కూడా యూనిట్ల నిర్వహణలో రిసోర్స్ బృందాలు లబ్ధిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా ప్రతిదశలోనూ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, బృందాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.