Monday, December 23, 2024

ప్రభుత్వం గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న గుగులోతు మమతను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మమత తీసిన గిరిజన మహిళ చిత్రం ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ’వోగ్ ఇటాలియా’లో ప్రచురితమవడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసంలో తన ఛాంబర్ లో గుగులోతు మమతను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

మమతతోపాటు అధికారులను, కళాశాల ఉపాధ్యాయులను అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గిరిజన గురుకులంలోని ఫైన్ ఆర్ట్ అకాడమీలో ఫొటోగ్రఫీ అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా విశేష కృషి చేస్తోందన్నారు. గిరిజన పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ భావించి అనేక గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు.

ఔత్సాహిక విద్యార్ధులు తమ నైపుణ్యాలలో రాణించడానికి వృత్తి విద్య కోర్సులను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీలో వారి ప్రతిభను చాటుకోవడానికి వారికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులను వారి నైతికత ప్రధాన విలువలను పెంపొందించేలా మార్గనిర్దేశం చేయడం ద్వారా వారి జీవితంలో నైతికంగా విజయం సాధించేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు వారి కెరీర్ గ్రాఫ్‌ను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి గిరిజన గురుకులాల్లో విద్యార్థులు సాధిస్తున్న ఉత్తీర్ణత శాతం అందుకు నిదర్శనం అన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సోమనాథ్ శర్మ, ఓ ఎస్ డి అశ్విని, ఫోటోగ్రఫీ అధ్యాపకులు రఘు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News