ఈ ప్రతిపాదనపై కొద్ది వారాలుగా చర్చలు
చర్చల తర్వాత కేబినెట్ ఆమోదం అవసరం
మెగా ‘ఐపిఒ’ కోసం తీవ్రంగా కసరత్తు
అధికార వర్గాలు వెల్లడి
న్యూఢిల్లీ : ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. మెగా ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లో భారీగా వాటాను కొనుగోలు చేసేందుకు ఒక విదేశీ ఇన్వెస్టర్‌ను తీసుకోవాలనుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. భారీ పెన్షన్ ఫండ్స్ లేదా బీమా సంస్థలు వంటి ప్రముఖ వ్యూహాత్మక పెట్టుబడిదారులకు మాత్రమే ఎల్‌ఐసిలో ఎఫ్‌డిఐ అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఆర్థిక సేవల శాఖ, అలాగే డిఐపిఎఎం (పెట్టుబడి, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) మధ్య చర్చ జరుగుతోంది. ‘గత కొద్ది వారాలుగా ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. అంతర్గత మంత్రివర్గ చర్చలు కూడా కొనసాగుతున్నాయి, కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది’ అని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత ఎఫ్‌డిఐ పాలసీ ప్రకారం, బీమా రంగంలో స్వయంచాలక విధానంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు పరిమితి ఇచ్చారు. అయితే ఈ నిబంధన ఎల్‌ఐసికి వర్తించదు, ఎందుకంటే దీనికి ప్రత్యేక ఎల్‌ఐసి చట్టం అమలవుతోంది. సెబీ నిబంధనల ప్రకారం, పబ్లిక్ ఆఫర్ కింద ఎఫ్‌పిఐ (విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు), ఎఫ్‌డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) అనుమతి ఇచ్చారు. అయితే ఎల్‌ఐసి చట్టంలో విదేశీ పెట్టుబడులకు కేటాయింపు అనేది లేదు. విదేశీ పెట్టుబడిదారులు పాల్గొనేందుకు సెబీ నిబంధనల మేరకు ఎల్‌ఐసి ఐపిఒను ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. అందుకే ఎల్‌ఐసి ఐపిఒకు జూలైలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐపిఒకు రావాడానికి ముందు ఎల్‌ఐసి విలువను అంచనా వేసేందుకు గాను మిల్లిమన్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి ఇండియాను ప్రభుత్వం నియమించింది. ఎల్‌ఐసి ఐపిఒ భారతీయ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఆఖరు నాటికి ఎల్‌ఐసి ఐపిఒను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాలసీదారుల కోసం ఇష్యూలో 10 శాతం వాటాను కేటాయించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదిత ఐపిఒ కోసం ఎల్‌ఐసి చట్టంలో అవసరమైన సవరణలు చేపట్టింది. ముందస్తు ఐపిఒ లావాదేవీల సలహాదారులుగా డెలాయిట్, ఎస్‌బిఐ క్యాప్స్‌ను నియమించారు. మెగా ఐపిఒ నిర్వహణ రేసులో 16 మర్చంట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ వారంలో బ్యాంకర్లు డిఐపిఎఎం ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. బిఎన్‌పి పరిబాస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డిఎస్‌పి మెరిల్ లింఛ్ లిమిటెడ్‌తో సహా ఏడు అంతర్జాతీయ బ్యాంకర్లు ప్రజెంటేషన్‌లో పాల్గొంటాయి. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎల్‌ఐసి లిస్టింగ్ ప్రభుత్వానికి ఎంతో కీలకం కానుంది. చిన్న వాటాల విక్రయం, ప్రైవేటీకరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202122)లో రూ.1.75 లక్షల కోట్ల సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించడం ద్వారా రూ.1 లక్షల కోట్లు రానున్నాయని అంచనా. మిగతా రూ.75 వేల కోట్లు సిపిఎస్‌ఇ పెట్టుబడి వసూళ్ల నుంచి రానున్నాయి.