లక్నో: అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని బిఎస్‌పి నేత మాయావతి శనివారం అన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఓ అమెరికా పెట్టుబడి పరిశోధన సంస్థ, ముఖ్యంగా షార్ట్ సెల్లింగ్‌లో ప్రత్యేకంగా పనిచేస్తుంటుంది. అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్, అకౌంట్ల మోసాలకు పాల్పడిందంటూ ఆ సంస్థ ఆరోపణలు చేసింది. కానీ అదానీ గ్రూప్ కావాలనే తమ స్టాక్స్‌ను దెబ్బతీస్తున్నారని ప్రత్యారోపణకు దిగింది.
‘హిండెన్‌బర్గ్ నివేదిక ఫలితంగా గత రెండు రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా పతనమయ్యాయి. అదానీ స్టాక్స్‌పైన గణతంత్రదినోత్సవం నుంచే చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో దేశ ప్రజల కోట్లాది రూపాయల ప్రమేయం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉంటోంది’ అని మాయావతి చెప్పుకొచ్చారు.
‘అదానీ గ్రూప్ షేర్ల మోసాలకు పాల్పడింది అన్న ఆరోపణల తర్వాత అదానీ సంపద, ప్రపంచ ర్యాంకింగ్ పతనమైపోయాయి. అయితే ప్రభుత్వం ఈ గ్రూప్‌లో పెట్టుబడిగా పెట్టిన పెట్టుబడికి ఏం జరుగనుంది, ఆర్థిక వ్యవస్థ ఏమి కానుంది? అని ప్రజలు వ్యాకులం చెందుతున్నారు. పెట్టుబడి పెట్టిన మదుపరులకు చింత, నిద్రలేమి తప్పవన్నది సహజం’ అని ఆమె వివరించారు. ‘ప్రజల భయాలను దూరం చేసేలా ప్రభుత్వం ఓ ప్రకటన చేసి, స్పష్టతను ఇవ్వాలి’ అని ఆమె అన్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఆరంభం కానున్నాయి. ఈ విషయంపై ఉభయ సభలలో సవివరమైన ప్రకటనను ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా చర్యలు చేపట్టాలి’ అని మాయావతి అన్నారు.
రెండేళ్ల పాటు పరిశోధన చేసిన హిండెన్‌బర్గ్ భారత సంస్థ అదానీ గ్రూప్ 17.8 ట్రిలియన్‌ల(218 అమెరికా డాలర్ల) మేరకు స్టాక్ మ్యానిపులేషన్‌కు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని పేర్కొంది. కాగా అదానీ గ్రూప్ మాత్రం హిండెన్‌బర్గ్ నివేదిక తమకు దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆ సంస్థ తమ గ్రూప్‌పై నిరాధార ఆరోపణలు చేసిందని, సెలెక్టివ్ తప్పుడు సమాచారం ఇచ్చిందని, అవాస్తవిక ఆరోపణలు చేసిందని పేర్కొంది. పోర్టుల నుంచి విద్యుత్ ప్లాంట్‌ల వరకు అనేక సంస్థలను నిర్వహించే(కాంగ్లోమెరేట్) అదానీ సంస్థ ఆ నివేదికను ఖండించింది.