సిద్ధిపేట: ఈ విద్యా సంవత్సరమే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, వెటర్నరీ కళాశాలను ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ప్రజా అవసరాలు కేంద్రంగా సిద్ధిపేట జిల్లా ఏర్పాటుకు ముందే ఎంసెట్ పరీక్షా కేంద్రం, ఎస్ఈఈ విద్యుత్ కార్యాలయాన్ని ప్రారంభించి మనం మార్గదర్శకంగా నిలిచామని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నూతన మూల్యాంకన కేంద్రాన్ని శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తన పదేళ్ల ప్రయత్నమే ఈ ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రమని, పదేళ్లుగా ప్రయత్నిస్తే వచ్చిందని గత జ్ఞాపకాలను తెలిపారు. ఏంసెట్ పరీక్షా కేంద్రం, విద్యుత్ ఎస్ఈఈ కార్యాలయం, మహిళ డిగ్రీ కళాశాల, నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐ కళాశాల, పీజీ కళశాల, మెడికల్ కళాశాలను ప్రారంభించుకుని సిద్దిపేటను విద్యాక్షేత్రంగా మార్చుకున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, వెటర్నరీ కళాశాల ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే సిఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయిస్తానని.. త్వరలోనే ఉద్యోగ నోటిఫికషన్లు వస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు.అడగకుండానే కాంట్రాక్టు లెక్చరర్లకు 30 శాతం పీఆర్సీని ఇచ్చామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Govt Nursing college start soon in Siddipet: Harish