Sunday, September 8, 2024

పంచె కట్టుకున్న రైతంటే అంత అలుసా?

- Advertisement -
- Advertisement -

పంచె కట్టుకున్న రైతును అడ్డుకున్నందుకు బెంగళూరులోని మాల్‌పై కర్నాటక ప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఏడు రోజులపాటు మాల్‌ను మూసివేయాలని గురువారం ప్రభుత్వం ఆదేశించింది. తెల్ల చొక్కా, పంచె కట్టుకుని మాల్‌లో సినిమా చూసేందుకు వచ్చిన రైతును మాల్ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుకు జరిగిన అవమానం ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీయడమేనని అభివర్ణించిన ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితిలోను సహించేది లేదని స్పష్టం చేసింది. కర్నాటకలోని హవేరీ జిల్లాకు చెందిన ఫకీరప్ప అనే వృద్ధ రైతు మంగళవారం తన భార్య, బెంగళూరులో ఎంబిఎ చదువుతున్న తన కుమారుడితో కలసి జిటి వరల్డ్ మాల్‌కు వెళ్లారు. అయితే పంచె కట్టుకున్నాడన్న కారణంతో ఫకీరప్పను మాల్‌లోని మల్టీప్లెక్స్‌లోకి అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు.

ప్యాంటు ధరించి వస్తేనే లోపలకు అనుమతిస్తామని వారికి తెగేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాల్ సిబ్బంది దురుసు ప్రవర్తనపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై స్పంఇంచిన ప్రభుత్వం మాల్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. జిటి వరల్డ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, తక్షణ చర్యగా మాల్‌ను 7 రోజులపాటు మూసివేయాలని ఆదేశించామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ శాసనసభలో ప్రకటించారు. అంతకుముందు ఈ అంశాన్ని స్పీకర్ యుటి ఖాదర్ ప్రస్తావిస్తూ పంచె కట్టుకోవడం కర్నాటక సాంప్రదాయమని, పంచె కట్టుకున్న వ్యక్తిని మాల్ సిబ్బంది అడ్డుకోవడం క్షమించరాని విషయమని అన్నారు. అన్ని మాల్స్‌కు గుణపాఠం చెప్పే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News