లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వివాదాల నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన రెట్రోస్పెక్టివ్ టాక్స్(వెనకటి తేదీనుంచి వేసే పన్ను)విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు తెచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ సహా 15 సంస్థలు లబ్ధి పొందనున్నాయి.ఈ బిల్లు ప్రకారం..2012 మే 28కన్నా ముందు జరిగిన పరోక్ష ఆస్తుల బదలాయింపులపై ఎలాంటి పన్నులూ విధించబోమని కేంద్రం పేర్కొంది. బిల్లులో భాగంగా రెట్రోస్పెక్టివ్ పన్ను కింద వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీ లేకుండా తిరిగి రీఫండ్ చేయనుంది. గత కొన్నేళ్లుగా దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను విధానం వల్ల పెట్టుబడిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీని రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ విషయాల్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2012లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను విధానాన్ని తీసుకువచ్చింది.