Thursday, January 23, 2025

“రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్‌” పేరున కొత్త జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సైన్స్ విభాగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి గుర్తింపుగా ఇంతవరకు ప్రదానం చేస్తున్న దాదాపు 300 అవార్డులను రద్దు చేసి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ పేరున కొత్త జాతీయ అవార్డులను ప్రభుత్వం ఆవిష్కరించింది. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఇవి అత్యున్నత గుర్తింపు కలిగిన అవార్డులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు విభాగాల్లో విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువశాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీమ్ అనే నాలుగు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల ప్రదానానికి ప్రభుత్వ ప్రధాన సైన్సు సలహాదారు నేతృత్వంలో కమిటీ దేశం మొత్తం మీద 13 ప్రాంతాల నుంచి సైంటిస్టులను ఎంపిక చేస్తుంది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను 1958 నుంచి ఇస్తున్నప్పటికీ ఇంతవరకు దేశం లోని ఏడు ప్రాంతాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసేవారు.

ఇప్పుడు సైన్స్, టెక్నాలజీలకు సంబంధించి ఏ రంగమైనా 13 కేటగిరీలలో 45 ఏళ్లు మించని యువశాస్త్రవేత్తలకు బహూకరిస్తారు. విజ్ఞాన్ టీమ్ అవార్డు ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది గల సైంటిస్టులకు లేదా పరిశోధకులకు, నూతన ఆవిష్కరణలు కనుగొన్నవారికి ఇస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థల్లోని వారే కాకుండా స్వతంత్రంగా అసాధారణ ప్రతిభ చూపించే వారు కూడా అర్హులే. ఈ అవార్డుల కోసం ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నేషనల్ టెక్నాలజీ దినోత్సవం మే 11న అవార్డులను ప్రకటిస్తారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23న ప్రదానం చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News