ఒక హక్కును మనం కోరుకోవాలంటే దానికి చట్టంలోనైనా సంప్రదాయంలోనైనా గుర్తింపు ఉండాలి. రెండింటిలోను లేని హక్కు మనకు కావాలంటే రెండింటినీ గుర్తించని వారి అండ కావాలి. (ఆ హక్కు ఇప్పటికున్న చట్టాన్నీ, సంప్రదాయాన్నీ దాటిపోయేది కావచ్చు. లేదా ఏ చట్టమూ ఏ సంప్రదాయమూ ఒప్పుకోజాలనిది కావచ్చు.) అంటారు మానవ హక్కుల నేత డాక్టర్ కే. బాలగోపాల్. ఇది మావోయిస్టులు, పాలకులు ఇరువర్గాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. పౌర సమాజం సైతం ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు డాక్టర్ కే. బాలగోపాల్ విశ్లేషణ మరింత చర్చ జరుగాల్సిన సందర్భమిది.
ఎందుకంటే క్రమంగా మావోయిస్టుల భావజాలానికి బహిరంగంగా ప్రజలు అండగా నిలిచే పరిస్థితి లేదు. మావోయిస్టులు కోరుకునే వ్యవస్థను ప్రజలు తమ హక్కుగా భావించే పరిస్థితి కూడా లేదు. ఇదే పాలకులకు వరంగా మారి చట్టంలోనూ సంప్రదాయంలోనూ లేని కొత్త హక్కు అన్నట్లుగా ఆపరేషన్ కగార్ పేరుతో ఈ దేశపౌరులపైనే ( మావోయిస్టులు కూడా మనుషులే, ఈదేశ పౌరులే అనే భావంతో చెప్తున్న మాట ఇది ) ఈ దేశ సైన్యంతో యుద్ధం చేయిస్తున్నారు. మరోవైపు తమ భావజాలాన్ని ప్రశ్నించినా లేదా ఏమాత్రం అభ్యుదయంగా ఆలోచించినా వారిని ప్రమాదకరంగా భావించి మేధావులు, జర్నలిస్టులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు అనేక మందిపై, UAPA ఉపా, దేశద్రోహం చట్టం క్రింద అర్బన్ నక్సలైట్ల పేరుతో జైలుపాలు చేశారు. చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికీ వారంతా హక్కుల నేపథ్యం, కేవలం ప్రగతిశీల భావాలు కలిగి ఉన్న నేరానికి ఏళ్ళ తరబడి విచారణ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతుండగా, మరి కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. పాలకులు తమకు వ్యతిరేక భావజాలాన్ని గానీ, తనకు వ్యతిరేక పక్షాలను గానీ సహించలేకపోతుందనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య భావన పలుసందర్భాల్లో అపహాస్యం చేయబడుతూనే ఉంది. దేశంలో కీలకమైన రైతులు, కార్మికుల విషయంలో తెచ్చిన చట్టాలు కూడా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మూడుసార్లు ఢిల్లీ సిఎంగా పని చేసిన కేజ్రీవాల్ను తీవ్రవాదుల మద్దతుదారుగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ గా ముద్రవేయడం ప్రతిపక్షాలను సహించలేని అసహనం నుండి ఉద్భవించిన విమర్శలే. ఇవన్నీ పాలకుల తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అయితే ముందే చెప్పినట్లుగా…ఒక హక్కును మనం కోరుకోవాలంటే దానికి చట్టంలోనైనా సంప్రదాయంలోనైనా గుర్తింపు ఉండాలి. రెండింటిలోను లేని హక్కు మనకు కావాలంటే రెండింటినీ గుర్తించని వారి అండ కావాలి. ఈ విషయం సరిగ్గా ఇప్పుడు మావోయిస్టులు, పాలకులు అన్వయించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మావోయిస్టులు చట్టంలోనూ, సంప్రదాయంలోనూ లేని హక్కు కోసం వారి ఆచరణ ఉన్నట్లు పాలకులు భావించినట్లైతే మరి ఏ చట్టంలోను ఏ సంప్రదాయంలో ఉన్న హక్కులాగా ఆపరేషన్ కగార్ పేరుతో పాలకులు మావోయిస్టులపై యుద్దానికి దిగినట్లు..? చట్టంలో ఉన్నహక్కును, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛా హక్కును ఉపయోగించుకునే మేధావులు, జర్నలిస్టులు, రచయితలు, ప్రజాస్వామ్యిక వాధులపై అర్బన్ నక్సల్స్ ముద్రవేసి, ఆ పేరుతో చంపడమో, లేక బంధించడమో, లేక కేసులు పెట్టి భయపెట్టడమో చేస్తున్నారంటే ఏ చట్టంలోని, ఏ సంప్రదాయంలోని హక్కుతో పాలకులు చేస్తున్నట్లు..? ఇప్పటివరకు అధికారిక సమాచారం ప్రకారం 20214 – 2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 8719 ‘ఉపా‘ కేసులు నమోదయ్యాయంటే అతిశయోక్తి కాదు. అయితే వాటిలో శిక్షలు పడినవి 222 మాత్రమే. ఆ ఎనిమిదేండ్లలో 14,809 మంది ఉపా కింద అరెస్టయితే, 356 మందిపైనే నేరాభి యోగాలు రుజువయ్యాయి. ఉపా కేసుల బనాయింపు పాలకుల కనుసన్నల్లోనే సాగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఈ చర్యలను ప్రజాస్వామ్య పాలనకగా చూడగలమా..?
ఇక మావోయిస్టులపై యుద్ధంలో 2000వ సంవత్సరం నుండి 2025 మార్చ్ 21 వరకూ భారత దేశవ్యాప్తంగా 5549 సంఘటనలు నమోదు అయినట్లు ఒక అంచన. ఈ సంఘటనలల్లో పోలిసులు, భద్రత దళాల మరణాల సంఖ్య 2704 కాగా, మావోయిస్టుల మరణాల సంఖ్య 4712 మందిగా ఉన్నది. ఈ ప్రాణ నష్టానికి, ఈ యుద్దానికి
ఈ పేరుతో సమాజంలో ఉన్న అలజడికి ఇరుపక్షాలు బాధ్యులే అనేది గుర్తించాలి. మావోయిస్టులు చట్టం, సంప్రదాయంలోనూ రెండో హక్కు కోసం ఉద్యమించడం నేరమైనప్నుడు, ఒక భావజాలాన్ని యుద్ధంతో అంతమొందించాలని చూడటం కూడా పాలకులకు తగదు. ఇది మావోయిస్టులు కోరుకునే హక్కులాగే పాలకులు కూడా మరో హక్కు కోసం చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది. అది ఈ దేశంలో ఏ భావజాలం లేకుండా పాలకులు చెప్పే భావజాలమే ఫైనల్ గా ఉండాలని అది హక్కుగా భావించి చేస్తున్న యుద్ధం లాగా మిగిలిపోతుంది.
అందుకోసమే అటు మావోయిస్టులు, ఇటు పాలకవర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ఫలితాలు చరిత్రలో రక్తపు చరిత్రగా లిఖించబడుతున్నప్పుడు మరో పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధపడటంలో వెనుకాడాల్సిన అవసరం లేదు. అందుకే యుద్ధం కంటే శాంతియుత చర్చలతో రాజకీయ పరిష్కారానికి మావోయిస్టులు, పాలకులు సిద్ధపడాలి. అందుకు ఇరువర్గాలు సంసిద్ధంగా ఉండాలి. దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామిక వాదులు, పౌరసమాజం చర్చలకు దారులు వేయాలి. మావోయిస్టులు, పాలకులు అందుకు ద్వారాలు తెరువాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే ప్రజాస్వామ్యానికి మేలు.
దామెరా రాజేందర్ (దారా)
సీనియర్ జర్నలిస్ట్
ఉపా బాధితుడు