హైదరాబాద్ : నగరంలో ఈఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులపై ప్రత్యేక పోకస్ పెట్టారు. స్కూళ్లకు ఒంటిపూట బడులు పెట్టిన టెన్త్ విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సబ్జెక్టులో వెనకబడిన విద్యార్థుల కోసం రోజువారీగా టెస్టులు పెడుతూ ప్రతిభను గుర్తిసున్నారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లు స్కూళ్లు నడవకపోవడంతో విద్యార్ధులు చదువులో ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ప్రతి విద్యార్థి మార్కులను పరిశీలిస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ అవసరమైతే మరో గంటపాటు పాఠాలు బోధిస్తున్నారు. చదువులకు ఇబ్బందులు కాకుండా పాఠశాల్లో తాగునీరు, బెంచీలు,బోర్డు ఏర్పాటు చేసి చదువుల్లో పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధించి సర్కార్ బడుల సత్తా చాటుతామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రతి పాఠశాల్లో 90శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాంటున్నారు.
పరీక్షలు మే మూడో వారంలో నిర్వహిస్తుండటంతో ఇప్పటికే ప్రైవేటు బడుల్లో అన్ని సబ్జెక్టులు పూర్తి చేసి, ఈనెల రివిజన్ తరగతులకు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాల తగ్గేవి, ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఇదే తరహాలో ప్రభుత్వ బడుల వైపు విద్యార్ధులు మొగ్గుచూపేందుకు పదిలో ఫలితాలు పెరిగితే ఇంకా పెద్ద ఎత్తున ఆడ్మిషన్లు పెరుగుతాయని సిబ్బంది అంటున్నారు. అదే విధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రభుత్వం పాఠశాల్లో ప్రారంభిస్తుండటంతో ఈసారి పదోతరగతి ఫలితాల్లో దూసుకపోతే విద్యార్ధుల సంఖ్య సర్కార్ బడుల్లో గణనీయంగా పెరుగుతుందని ప్రధానోపాధ్యాయులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల్లో 7800మంది, రంగారెడ్డి జిల్లాలో 9040మంది, మేడ్చల్ జిల్లాలో 8450మంది పరీక్షలు రాయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీరందరు కళాశాల చదువులు చదివేలా తమ అనుభవంతో పాఠాలు బోధించి ఈసారి ప్రకటించే పదోతరగతి ఫలితాల్లో ముందు జాబితాలో ఉంటామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.