న్యూఢిల్లీ: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సమీపంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని ఆయన చెప్పారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సిసిఎల్)లో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌సిసిఎల్ సమీపంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడంపై తెలంగాణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ వేలాన్ని నిలిపివేసి ఈ నాలుగు బ్లాకులను కంపెనీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనికి మంత్రి స్పందిస్తూ ఇప్పుడు వేలం విధానం అమలవుతోందని, రాష్ట్రాలకు బొగ్గు కేలాయింపులో సైతం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఏకపక్షంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. యుపిఎ హయాంలో మాదిరిగా కేటాయింపులు జరపడం లేదని మంత్రి చెప్పారు. ఎస్‌సిసిఎల్‌కు చెందిన 50,000మంది కార్మికులు ప్రస్తుతం సమ్మె చేస్తున్నారని, దీని వల్ల రోజుకు రూ.120 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు అవసరాలను ఎస్‌సిసిఎల్ తీరుస్తోందని ఆయన వివరించారు. కాగా..ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనను అవాస్తవంగా మంత్రి కొట్టివేశారు.
Govt to follow auction for Coal block allocation:Pralhad Joshi