Sunday, December 22, 2024

బస్సుల కొనుగోలుకు మహిళా సంఘాలకు రుణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య బస్సుల్లో పెరిగినందున కొత్త బస్సులు కావలసిన అవసరం ఏర్పడుతోందని, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించాలన్న ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి చింతకాని మండలం, జగన్నాధపురం వరకు సామాన్యుడిగా ప్రయాణం చేసి మహిళా ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రవేశపెట్టిన ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి స్వయంగా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా బస్సులో టికెట్ కొని ప్రయాణం చేసిన ఆయన తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహాలక్ష్మి పథకం కింద అమలవుతున్న వివరాలను ఆయన ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

మీ ఇళ్లల్లో కరెంటు మంచిగా వస్తోందా? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్‌టిసి బస్సులో ప్రయాణం చేశారు? అంటూ ఆరా తీశారు. నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మతో ఆయన ముచ్చటించారు. డిప్యూటీ సీఎం ప్రశ్నలకు వారు స్పందిస్తూ ’బడి, గుడి,, పేరంటాలకు ఉచితంగా బస్సులో వెళ్లడం మూలంగా డబ్బులు మిగులుతున్నాయని, దీని ద్వారా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతోంది’ అని వారు సంతోషంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీ చేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను డిప్యూటీ సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రీ బస్సులు వాడుకుంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, మహిళలకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్‌టిసి బలోపేతం అవుతోందని అన్నారు. కొత్తగా 300 పైగా బస్సులు కొనుగోలు చేశామని, దీనిద్వారా సంస్థ విస్తరణకు దోహదపడుతుందని ్క అన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

ఆర్‌టిసిపై ఉన్న అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆలోచన చేస్తున్నామని అన్నారు. బిఆర్‌ఎస్ నాయకులకు మహిళలు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం ఇష్టం లేనట్టుగా ఉందని, అందుకే ఉచిత ఆర్‌టిసి బస్సు పథకం నడపవదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు ఏడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచడానికి తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని వాటి ద్వారా కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని, ఇది బిఆర్‌ఎస్ నాయకుల కంటికి కనబడటం లేనట్టుంది కళ్ళు లేని కబోదులుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. భట్టితోపాటు బస్సులో జిల్లా కలెక్టర్ గౌతమ్, వైరా శాసనసభ్యుడు రామదాసు నాయక్, ఆర్‌టిసి రీజినల్ మేనేజర్ వెంకన్న పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రయాణం చేశారు. అంతకుముందు పాత బస్టాండులో పాతర్లప్రాడు గ్రామానికి వెళ్లే నూతన బస్సును ఆయన ప్రారంభించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News