పిఎం ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఒక కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అద్దె ఇళ్లలో లేదా మురికివాడలలో నివసించే మధ్య తరగతి ప్రజలు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ పేతల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు.
2024-25 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను గురువారం ఆమె పార్లమెంట్‌లో సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ తాత్కాలిక బడ్జెట్ అమలులో ఉంటుంది. అద్దె ఇళ్లు లేదా మురికివాడలు, అక్రమంగా వెలసిన కాలనీలలో నివసించే మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటిని సమకూర్చే ఉద్దేశంతో ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నదని మంత్రి తెలిపారు.
గత 10 సంవత్సరాలుగా సమ్మిళిత అభివృధ్దిలో భాగంగా పేదలకు సొంత ఇల్లు, మంచినీరు, విద్యుత్, వంట గ్యాసు, బ్యాంకు ఖాతాను సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కొవిడ్ 19 మహమ్మారి కాలంలో ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ప్రధాని ఆవాస్ యోజన(గ్రామీణం) ఆగలేదని, మూడు కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యానికి అతి చేరువలో ఉన్నామని ఆమె వెల్లడించారు. జనాభా అవసరాలకు గనుగుణంగా రానున్న ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని ఆమె చెప్పారు.