న్యూఢిల్లీ: డీప్‌ఫేక్ సమస్య పై ప్రభుత్వం త్వరలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సమావేశమవుతుందని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైషవ్ శనివారం ఇక్కడ చెప్పారు. డీప్‌ఫేక్ ఫొటోలను, వీడియోలను మీడియా తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు గనుక పక్షంలో సేఫ్ హార్బర్ ఇమ్యూనిటీ క్లాజ్ వర్తించబోదని మంత్రి స్పష్టం చేశారు. డీప్‌ఫేక్ అంశంపై ప్రభుత్వం ఇటీవల కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా దీనికి సానుకూలంగా స్పందించాయని మంత్రి చెప్పారు. అయితే అలాంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి కంపెనీలు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి..
అయితే మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సమావేశం కానున్నాం. డీప్‌ఫేక్‌లను నిరోధించడానికి, తమ వ్యస్థలను ప్రక్షాళన చేయడానికి అవి తగు చర్యలు తీసుకునేలా సమస్యపై ఆ సంస్థలను మానసికంగా సిద్ధం చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వైషవ్ చెప్పారు. మెటా, గూగుల్ లాంటి పెద్ద సంస్థలను కూడా ఈ సమావేశానికి పిలుస్తున్నారా అని ప్రశ్నించగా అవునని మంత్రి చెప్పారు.ఒకవేళ కంపెనీలు గనుక తగు చర్యలు తీసుకోని పక్షంలో ప్రస్తుతం వాటికి వర్తిస్తున్న సేఫ్ హార్బర్ ఇమ్యూనిటీ క్లాజ్ వర్తించబోదని కూడా మంత్రి స్పష్టం చేశారు.
27 కంపెనీలకు అనుమతులు
ఇదిలా ఉండగా కొత్త హార్డ్‌వేర్ స్కీమ్ కింద పిసిలు, టాబ్లెట్లు వంటి ఐటి ఉత్పత్తులను తయారు చేయడానికి 27 సంస్థలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ కంపెనీల్లో డెల్, ఫాక్స్‌కాన్, హెచ్‌పి, లెనోవా వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల హార్డ్‌వేర్ పథకం కింద 27 కంపెనీలకు ఆనుమతులు మంజూరు చేసినట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కంపెనీల్లో 95 శాతం కంపెనీలు ఎప్పుడైనా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని మంత్రి చెప్పారు.
దీంతో పిసిలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల తయారీలో మన దేశాన్ని ఓ బలమైన శక్తిగా నిలపనున్నాయని కూడా ఆయన చెప్పారు. ఈ కంపెనీలన్నీ కలిపి రూ.3,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నాయని, ఫలితంగా హార్డ్‌వేర్ ఉత్పత్తుల విలువ 42 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని కూడా ఆయన చెప్పారు.ఈ ప్రోత్సాహక పథకం ద్వరా 50 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 1.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం బావిస్తోంది.