త్వరలోనే కొత్త పాలసీ: మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : దేశంలో నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సరికొత్త కోఆపరేషన్ మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఈ విషయం తెలిపారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ఈ దిశలో రాష్ట్రాలతో సమన్వయంతో వ్యవహరిస్తామని చెప్పారు. తొలి జాతీయ సహకార సదస్సు ( సెహకారిత సమ్మేళన్)లో మంత్రి ప్రసంగించారు. దేశంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంస్థల (పిఎసి) వచ్చే ఐదేళ్లలో మూడులక్షల సంఖ్యకు పెంచడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు దేశంలో కేవలం 65000 పిఎసిలే ఉన్నాయి. తొలిసారిగా జరిగిన ఈ సదస్సుకు వివిధ సహకార సంస్థల నుంచి దాదాపు 2100 మంది వచ్చి పాల్గొన్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ ద్వారా 6 కోట్ల మంది పాల్గొన్నారు.
ఇటీవలి కాలంలోనే ఈ సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సంబంధించి పలువురు అనేక ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి తెలిపారు. సహకార వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోకి వచ్చినప్పుడు కేంద్ర మంత్రిత్వశాఖ ఎందుకు ఏర్పాటు చేశారనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఓ వ్యవస్థకు అయినా చట్టపరమైన జవాబుదారి ఉండాలని చెప్పిన షా సంబంధిత అంశంపై తాను వాదనకు దిగదల్చుకోలేదన్నారు. సహకారం ఉద్యమ బలోపేతం దిశలో రాష్ట్రాలతో కేంద్రం సమన్వయంతో వ్యవహరిస్తుందని, తద్వారానే సత్పలితాలకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఇంతకు ముందు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కొ ఆపరేటివ్ పాలసీని ఆవిష్కరించారని, అయితే ఇప్పుడు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తోందని తెలిపారు.