Saturday, September 21, 2024

సంస్కరణలా! ఆకర్షణలా!!

- Advertisement -
- Advertisement -

ఓటర్లను సంతృప్తి పర్చడానికి ప్రభుత్వాలు తలకు మించిన ఆర్థిక భారంతో కూడిన పథకాలను అమలు చేయడానికి ప్రయత్నించడం దేశ భవిష్యత్తుకు ప్రతిబంధకమే. ఉదాహరణకు దాదాపు 2.3 మిలియన్ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రకటించడం ఉద్యోగులకు ఒకవైపు గ్యారంటీ కల్పిస్తున్నా మరోవైపు ప్రభుత్వ ఖజానాకు ఆర్థికంగా భరించలేని సమస్యగా తయారైంది. ఉదాహరణకు ఏకీకృత పెన్షన్ పథకం ఖజానాను ఖాళీ చేయించడమే కాకుండా మొదటి సంవత్సరం లోనే రూ. 800 కోట్ల బకాయిలతోపాటు రూ.6250 కోట్లు వెచ్చించవలసి వస్తుంది. కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోడానికి ఏదో ఒకటి ఆకర్షణీయ పథకాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసి వస్తోంది.

కొన్ని రోజుల ముందు 45 మంది ఉన్నతాధికారులను దొడ్డిదారిని నియమించుకునే లేటరల్ ఎంట్రీ ప్రక్రియను విపక్షాల నుంచి, భాగస్వామ్య పక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడం తో విరమించుకోవలసి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెలువడడం ఓటర్లు అసంతృప్తితో ఉన్నారనడానికి ప్రబల సాక్షం. అందుకనే ఓటర్లను, మిత్రపక్షాలను అక్కున చేర్చుకోడానికి కేంద్రం అనేక మార్గాలు వెతుకుతోంది. అయితే సంస్కరణలంటూ కేంద్రం ఏవో కొన్ని చర్యలు తీసుకుంటున్నా అవి అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నాయి. ఇది రాజకీయ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలకు ప్రమాదంగా ఉంటోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్షాన్ని సాధించాలనుకుంటున్న భారత్ కు ప్రస్తుత అభివృద్ధి ఏమాత్రం సరిపోదు.

దీనికోసం కొన్ని ముఖ్యమైన రంగాల్లో వ్యవస్థాపరమైన సంస్కరణలు తీసుకోవలసిన అవసరం ఉంది. అయితే వచ్చిన చిక్కంతా ఈ సంస్కరణలు రాజకీయ రిస్కు, ప్రజాకర్షక అజెండాలతో ముందుకు సాగడం లేదు. ఉదాహరణకు 2019 2020లో నాలుగు కార్మిక చట్టాలు పార్లమెంట్‌లో ఆమో దం పొందినప్పటికీ, జాబ్ మార్కెట్‌లో సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నా వీటిని అమలులోకి తీసుకురావడం కష్టతరమవుతోంది. ప్రజాకర్షక పథకాలకు వ్యయం పెరిగిపోతుండటంతో కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు బాగా తగ్గించవలసి వస్తోంది. దీనికి ఉదాహరణగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల అనుభవాలను పేర్కొనవచ్చు. ఈ ఏడాది మహారాష్ట్ర బడ్జెట్ పథకాలు రూ. 90 వేల కోట్లు మించిపోతున్నాయి. భారతదేశం యువ జనాభాతో గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన దేశాల హోదాలోకి చేరుతోంది.

అయితే అత్యధిక ఆదాయ దేశాల ర్యాంకులోకి చేరడం భారత్ వంటి మధ్యాదాయ దేశాలకు కష్టతరమవుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక ఇటీవలనే వెల్లడించింది. భౌగోళ రాజకీయ పరిస్థితుల్లో మార్పు వస్తుండటం, వాతావరణ మార్పులు, రుణస్థాయిలు పెరుగుతుండడం, దీనికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఆర్థిక పురోగతికి ఎదురవుతున్న ప్రాథమిక అడ్డంకులను పరిష్కరించుకునే ప్రయత్నాలకు బదులు ప్రజాకర్షక పథకాలపై దృష్టి కేంద్రీకరించడంతో మధ్యాదాయ ఉచ్చులో చిక్కుకుని ఏమీ చేయలేని దేశాల సరసన చేరిపోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోత విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రాలకు అమలు చేస్తున్న పథకాల్లో తన వాటాను 75 నుంచి 50 శాతం వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కొన్ని పథకాలను ఇతర పథకాల్లో కలిపివేయడం కానీ లేదా అవసరాలను తీర్చలేని వాటిని తొలగించడం కానీ చేయాలనుకుంటోంది.

కొన్ని పథకాలకు నిధుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే జవాబుదారీ వహించడంతోపాటు ఎక్కువ శాతం కేటాయింపుల బాధ్యత రాష్ట్రాలే తీసుకునేలా నిబంధనలు అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఆయా వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు అక్టోబర్ చివరినాటికి మదింపు పూర్తి చేయనున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు కేంద్రం నిధులు కేటాయించే పథకాలను 130 నుంచి 75 వరకు తగ్గిస్తూ వచ్చారు. మరోవైపు నీతి ఆయోగ్ కేంద్ర ప్రాయోజిత పథకాలన్నిటినీ మదింపు చేస్తూ వస్తోంది. పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కన్సల్టెన్సీ సంస్థలను నియమించాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.

202425 బడ్జెట్‌లో పథకాల కోసం రూ. 5.05 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేటాయింపులు బాగానే ఉన్నా ఏ విధం గా ఆర్థికంగా వీటిని భరించాలన్న తర్జనభర్జనలో కేంద్రం సతమతమవుతోంది. జలశక్తి, పారిశుధ్యం, విద్యుత్, పునరుత్పాదక శక్తి, సామాజిక రంగాలకు చెందిన కొన్ని పథకాలను సమీప లేదా పెద్ద స్కీమ్‌లో భాగం చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ పథకాలకు తన వాటా ఎక్కువ శాతం భరించకుండా రాష్ట్రాలు ఎక్కువ శాతం భరించేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ఫలితంగా రాష్ట్రాలే చాలావరకు ఈ పథకాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News