కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ఖర్గే
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఎంపీల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే రాజ్యసభ వర్షాకాల సమావేశాల చివరి రోజున మహిళామార్షల్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందని కాంగ్రెస్ పక్షం నేత మల్లికార్జున్‌ఖర్గే ఆరోపించారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనుకుంటే అలా జరగలేదని ఖర్గే అన్నారు. ఆగస్టు 11న బీమా చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ముందు 40-50 మంది మార్షల్స్‌ను మోహరించారని, వారిలో మహిళా మార్షల్స్ కూడా ఉన్నారని ఖర్గే తెలిపారు. సభలో హింసాత్మక ఘటనలు జరిగినపుడు మాత్రమే చైర్మన్ మార్షల్స్‌ను పిలవడం గతంలో జరిగిందని, బీమా బిల్లును పాస్ చేయించుకోవడానికి కేంద్రం ముందస్తు ప్రణాళికతోనే మహిళా మార్షల్స్‌ను వినియోగించిందని ఖర్గే విమర్శించారు. ప్రతిపక్ష ఎంపీలు పొరపాటున మహిళా మార్షల్స్‌ను తాకితే అవమానించాలని కేంద్రం చూసిందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.