సౌర, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ వ్యవస్థ
నిర్మాణంలో 26 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్తు సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులను నడపడానికి వీలుగా ఎలక్ట్రిక్ హైవీలు అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇండోఅమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. దేశ రవాణా వ్యవస్థ విద్యుత్‌తో నడిచే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని పేర్కొన్నారు.ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని, ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేసే అంశం పైనా పనిచేస్తున్నట్టు చెప్పారు.
దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటాయని వివరించారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో సైతం సోలార్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తున్నామని చెప్పారు. భారత సరకు రవాణా ప్రాజెక్టుల్లో , రోప్‌వేలు, కేబిల్ కార్ రంగాల్లో భాగస్వామ్యానికి అమెరికా ప్రైవేట్ పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదార్లకు ఆనుకుని దాదాపు 3 కోట్ల చెట్లు నాటడమౌతుందని, ఇంతవరకు 27,000 చెట్లు నాటడమైందని చెప్పారు.