మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటు అయ్యాక పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య పని వారు బాగా చేస్తున్నారని, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న పనులను అభినందించారు. ప్రభుత్వం గ్రామాలలో అన్ని మౌలిక వసతులు కల్పించిందని, గతంతో పోలిస్తే పల్లెలు పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధుల బారిన పడేవారి శాతం తగ్గిందన్నారు. శంకుస్థాపన చేసిన 3 నెలల్లో గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టిన సర్పంచ్ బోల శేఖర్‌ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
జిల్లాలో చేపట్టిన అన్ని గ్రామ పంచాయతీ భవనాలను త్వరలోనే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 3 నెలల్లో జిపి భవనాన్ని కట్టిన సర్పంచ్ బోల శేఖర్‌ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన జిపి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని, అభివృద్ధ్ది విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు విడవకుండా శ్రమిస్తున్నారని అన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో నూ తనంగా 50 గ్రామ పంచాయతీ భవనాలను ఏర్పాటు చేయడానికి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరే శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ , సర్పంచ్ బోల శేఖర్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, తహసీల్దార్ చెన్నకిష్టన్న, ఎంపిడిఓ మున్నీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.