జనగామ ప్రతినిధి : జనగామ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను జూలై 5వ తేదీలోపు పరిష్కరించకుంటే జూలై 6 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఉద్యోగ కార్మికులకు గ్రామ పంచాయతీ యూనియన్ జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ రాపర్తి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జేఏసీ సమావేశానికి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.మల్లాచారి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు.
పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికుల వలే కేటగిరిల వారీగా వేతనాలు రూ.15,600, రూ.19,500, రూ.22,750గా పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 5వ తేదీన గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ పంచాయతీరాజ్‌శాఖ, కమిషనర్‌కి 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్‌ను అందజేయడం జరిగిందని తెలిపారు.
సమస్యలు పరిష్కరించకుంటే జూలై 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతామని, తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకత్వం కమిషనర్‌కు తెలియజేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్లు నారోజు రామచంద్రం, బత్తిని వెంకన్న, బస్వ రామచంద్రం, గుర్రం లాజర్, జేఏసీ జిల్లా, మండల నాయకులు గొడిశాల సోమయ్య, మేడె దయాకర్, జి.శ్యామ్‌శంకర్, కున్సోతు శాంతమ్మ, ఎల్లయ్య, మూడ్ రాధిక, ఎల్లమ్మ, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.