Wednesday, November 6, 2024

పట్టభద్రుని ఓటుకు పచ్చసంతకం కావాలా!

- Advertisement -
- Advertisement -

ఓటు హక్కు.. ఎంతో గొప్పది. తమకు, సమాజానికి కావాల్సిన ఓ మంచి నాయకున్ని ఎన్నుకొని రేపటి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఓటు హక్కు ఉపయోగపడుతుంది. ఓటు హక్కు కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ఓటు హక్కుపట్ల అనేక మంది అనేక రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయన మాత్రం తల ఉన్న ప్రతీ ఒక్కరికీ లింగ భేదం లేకుండా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు ఉండాల్సిందే అంటూ పట్టుబట్టి ఓటు హక్కును కల్పించారు. ఒకవేళ అంబేడ్కర్ గనుక ఓటు హక్కు కోసం ఉద్యమమే చేయకుంటే నేడు అనేక మంది ఈ సమాజంలో కనీస గుర్తింపు ఉండేది కాదు. ఈ ఓటు హక్కు ఉందనే కనీసం ఐదేళ్లకోసారి అయినా కడు పేదోని గుడిసె ముందుకు ఓటు వేయమని రెండు చేతులు జోడించి కాస్త గౌరవించబడుతున్నాడు.

ఆ ఓటు హక్కే లేకుంటే ఈ సమాజంలో ఊరి అవతల వెలియబడ్డ వాళ్లు.. ఇప్పటికీ కడు దీన స్థితిలో, ఆకలిచావుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని లెక్కల్లోకి తీసుకునేవారేకాదు. వారంతా కేవలం ఓట్ల సమయంలో మాత్రమే నాయకులకు గొప్పగా కన్పిస్తారు తప్ప ఇతర సమయాల్లో మాత్రం పట్టించుకోరు. రాజకీయ నాయకునికి కావాల్సింది ఓటు, దానికోసం ఎన్ని వేషాలు వేసైనా తనకు ఓటు వేయించుకోవాలని చూస్తారు. అయితే ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఓటరు జాబితాను సవరించడంతో పాటు కొత్త ఓట్లను నమోదు చేయడం, ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఓటర్లను గుర్తించి నమోదు చేస్తారు. పైగా పలు ప్రసార మాధ్యమాల ద్వారా, పెద్ద పెద్ద ప్రకటనలు హోర్డింగులతో ఓటు హక్కు వినియోగించుకుందాం అంటూ ప్రచారం చేస్తుంటారు.

ఓటర్లలో అవగాహన కల్పించడానికి పోలింగ్ శాతం పెంచడానికి అనేక రకాల ఏర్పాట్లు చేయడం మంచి చర్యనే. ప్రతీ పౌరుడు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నప్పుడే సమాజం మరింత గుణాత్మకంగా మారుతుంది. మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి ఓటుకు మించిన ఆయుధం ప్రజల చేతిలో మరొకటి లేదు. దానిని వినియోగించుకునే విధానాన్ని బట్టే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. శాసన మండలికి జరిగే వివిధ విభాగాలకు ప్రతినిధులు ఎంపిక అవుతారు. ఎంఎల్‌ఎ కోటా, గవర్నర్ కోటా, ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎంఎల్‌సిలు ఎన్నికవుతారు. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన వారికి ఆయా రంగాల్లో అర్హతను బట్టి గవర్నర్ తుది ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంటే పట్టభద్రుల ఎంఎల్‌సి కోసం మాత్రం ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం కన్పిస్తుందని చెప్పకతప్పదు. పట్టభద్రుల ఓట్ల నమోదును ఎన్నికల కమిషన్ చేపట్టకపోవడంతో పట్టభద్రులకు గంపగుత్తగా వివిధ ఎంఎల్‌సి పోటీదారులు దగ్గర ఉండి మరీ బృందాలను ఏర్పాటు చేసి ఓట్లు నమోదు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే స్వచ్ఛందంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులకు తమ ఓటును పచ్చ సంతకంతో ధ్రువీకరించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదిగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ప్రకటించింది. ఆయా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల ఉండి పట్టభద్రులుగా ఎంఎల్‌సి స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ఉంచి ఓటు నమోదు కోసం ప్రకటనలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా కాకుండా చేయడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్‌లైన్ సెంటర్లకువెళ్లి ఓటు నమోదు చేసుకునేంత సమయం వెచ్చించడం లేదు. ఇక చాలా మంది పట్టభద్రులు వివిధ కారణాలతో వివిధ ప్రాంతాల్లో నివాదం ఉండేవారు మనకు ఎందుకులే అని ప్రత్యేకంగా ఓటు హక్కును నమోదు చేసుకునే పరిస్థితుల్లో లేరు.

అయితే ఒకవేళ పట్టభద్రులుగా అవగాహన ఉండి సమాజంలో గుణాత్మక రాజకీయాల కోసం ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం పచ్చ సంతకంతో ధ్రువీకరణను కోరుతుంది. ప్రభుత్వం పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్‌సైట్‌లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్, ఓటర్ కార్డు నెంబరును నమోదు చేసినా మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దారు కార్యాలయంలో ఇవ్వాలనే షరతులు పట్టభద్రుల ఓటు ఆసక్తిని తగ్గించడమే అవుతుంది. ఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆయా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి అక్కడే ఓటు హక్కును నమోదును ప్రభుత్వమే చేస్తే బాగుండేది.

అలా కాకుండా అంతా ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న తరువాత తిరిగి ఆయా ధ్రువపత్రాలపై గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో పత్రాలను ధ్రువీకరించుకొని సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందించాలని ఫోన్లలో మండల స్థాయి క్షేత్ర అధికారులు ఓటు నమోదు చేసుకున్న పట్ట భద్రులకు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నది ఒక్క ఎత్తయితే ఇక గెజిటెడ్ అధికారి సంతకంతో ధ్రువీకరించుకోవడం మరో ఎత్తు. ఇలా పట్టభద్రులకు షరతులు పెట్టడం లాంటివి కాకుండా ప్రభుత్వమే పూర్తిగా పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేస్తే ఇటువంటి అనుమానాలకు, ఇబ్బందులు ఉండేవి కావు. నవంబర్ 6 చివరి గడువు ఉండడం, పట్టభద్రుని ఓటుకు పచ్చ సంతకం అవసరం కావాడం లాంటి షరతులతో ఓటు హక్కుకు పట్టభద్రులు నమోదుకు అంతగా ముందుకు రాకపోవచ్చు. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం
7893303516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News