Monday, December 23, 2024

ఢిల్లీమే సవాల్

- Advertisement -
- Advertisement -

Grain Dharna in Delhi on the 11th

11న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తలపెట్టిన
ధాన్యం ధర్నాకు పెద్దఎత్తున ఏర్పాట్లు

ఢిల్లీలో ధర్నా ఆవరణను పరిశీలించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి తదితరులు ప్రాంగణంలో కెసిఆర్, కెటిఆర్‌ల భారీ ఎత్తు ఫ్లెక్సీలు ‘వరి ధాన్యం సేకరించాలి, కేంద్రం రైతులకు
అండంగా ఉండాలి’ నినాదంతో ధర్నా చేపడుతున్నాం

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై వార్ ప్రకటించిన టిఆర్‌ఎస్ వేదికగా తన సత్తాను చాటేందుకు స మాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తలపెట్టిన ధర్నా కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశంపై గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో నాలుగంచెల ఆందోళనలను పూర్తి చేసిన టిఆర్‌ఎస్ తుది ఆందోళన (ఐదవ విడత) ఢిల్లీ వేదికగా దద్దరిల్లే విధంగా ప్రణాళికలను సిద్దం చేసింది. ఈ ధర్నాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు టిఆర్‌ఎస్ అగ్రశేణి నాయకులు, మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటు స్థానిక సంస్థల ప్ర జాప్రతినిధులందరూ ‘చలో ఢిల్లీ’కి సిద్ధమవుతున్నారు.

నేపథ్యంలో ధర్నా తలపెట్టిన ప్రాంగణాన్ని రైతు సమన్వయ సమితి ఆధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు. ధర్నా జరిగే ప్రాంతంలో కెసిఆర్, కెటిఆర్ ఫ్లెక్సీలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజాప్రతినిధులంతా పెద్దసంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి సౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అక్కడున్న పార్టీ నాయకులకు, తెలంగాణ భవన్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న నేపథ్యంలో దానిని తట్టుకునేలా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ధర్నాకు వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్ర స్థాయిలో గర్హిస్తూ ధర్నాను చేపడుతున్నట్లు వివరించారు. ప్రధానంగా వరి ధాన్యం సేకరించాలి.. కేంద్రం రైతులకు ఉండాలి అన్న నినాదంతో ధర్నాను చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంపై యావత్ తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర క్యాబినెట్ చేస్తున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. రైతులకు కావాల్సిన సాగునీరు…పంటలకు అవసరమైన పెట్టుబడి, ఎరువులు, కరెంటును టిఆర్‌ఎస్ ప్రభుత్వం పుష్కలంగా అందించడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులు 300 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించారన్నారు. కానీ పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో కేంద్రం ఉండడం సిగ్గుచేటన్నారు. దీని కారణంగా రైతులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేని కారణంగానే కేంద్రంపై టిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.

పంజాబ్‌లో ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం….తెలంగాణ నుంచి మాత్రం ఎందుకు కొనుగోలు చేయదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాష్ట్ర రైతులకు అండగా ఉండాల్సిన కాంగ్రెస్ నేతలు కూడా తలాతోక లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పైగా కేంద్రంలోని బిజెపి సర్కార్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చేవిధంగా మాట్లాడుతుండడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇక రాష్ట్రంలోని బిజెపి నాయకులు అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి పెద్దల అడుగలకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రం పెద్దల ఆదరణ కోసమే పనిచేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని ఆ రెండు పారీలు పూర్తిగా విస్మరించాయన్నారు. అందుకే రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా సిఎం కెసిఆర్…. కేంద్రం చర్యలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారన్నారు. ఢిల్లీ వేదికగా మోడీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సమాయత్తమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో 11వ తేదీన జరిగే మహాధర్నాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News