Wednesday, January 22, 2025

ధాన్యం కొనుగోళ్లు 10లోపు ముగింపు

- Advertisement -
- Advertisement -

ఎక్కువ జిల్లాల్లో వారంలో ముగియనున్న సేకరణ

అకాల వర్షాలకు తడిసిన 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
ఇప్పటి వరకు 4.72లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించాం
500 కేంద్రాల్లో సేకరణ ప్రక్రియ ముగిసింది: మంత్రి గంగుల కమలాకర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అత్యధికశాతం జిల్లాల్లో యాసంగి ధాన్యం సేకరణ కార్యక్రమం మరో వారం రోజుల్లో ముగియనుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మంగళవారం నాడు మంత్రి ధాన్యం కోనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకూ అకాల వర్షాలకు తడిసిన 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్టు తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని సూచించారు. ఈ సీజన్‌లో ధాన్యం సేకరణ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ రూ.5888కోట్ల విలువ మేరకు 30లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించినట్టు తెలిపారు. యాసంగిలో వరిసాగు చేసిన 4.72లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామన్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకూ 500 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ ప్రక్రియ ముగిసిందన్నారు.జూన్ 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా సేకరణ ముగుస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని ఎక్కడా ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాకారం అందించకున్నా, ప్రతిపక్షాలు కొనుగోళ్లను అడ్డుకోవాలని రాద్దాంతం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల కోట్లకు పైగా భారం పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగం కోసం ఆర్థిక నష్టాన్ని భరించి సేకరణ చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ సేకరించిన ధాన్యం మిల్లులకు కూడా చేరవేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని, రాష్ట్రంలో ఎక్కడా మిల్లుల్లో అన్లోడింగ్, రవాణాలో ఇబ్బందులు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడా తరుగు తీయోద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి వచ్చిన పిర్యాదుల్ని తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు.రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంటే ఓర్వలేని విపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని రైతులు పట్టించుకోకపోవడమే వారి డొల్లతనానికి నిదర్శనమన్నారు.

కొనుగోలు కేంద్రాలకు వెల్లి ధాన్యం సేకరణ ఆపాలని చూసిన ప్రతిపక్షాలకు చుక్కెదురైందని, ఆదినుండి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా, మే 2 వరకూ ఒక్క గన్నీ బ్యాగును సైతం అందించకున్నా ధాన్యం సేకరణ ఆగలేదన్నారు. కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే పిజికల్ వెరిఫికేషన్ పేరుతో కేంద్రం ఇబ్బందులు పెట్టిన విషయం రైతులకు సైతం తెలుసన్నారు. 6544 కొనుగోలు కేంద్రాలకు గానూ దాదాపు 500 కొనుగోలు కేంద్రాల్లో విజయవంతంగా ధాన్యం సేకరణ పూర్తయిందని, రోజుకు దాదాపు లక్షన్నర నుండి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. 11.64కోట్ల గన్నీ సంచులు సేకరించామని, వీటిలో 7.52 కోట్ల గన్నీల్ని వాడామని ఇంకా 4.12 కోట్ల గన్నీలు అందుబాటులో ఉన్నాయని , వీటి ద్వారా మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సేకరించవచ్చన్నారు. తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మొత్తం యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సేకరణ కొనసాగిస్తున్నామన్నారు. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తామని ఈ ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం తదితర మెజార్టీ జిల్లాలలో మరో వారం రోజుల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10వ తారీఖు వరకూ పూర్తవుతుందని మంత్రి గంగుల కమాలాకర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News