Wednesday, January 22, 2025

సంక్రాంతిలోపు స్థానిక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :డిసెంబర్ లేదా సం క్రాంతిలోపు స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాతి నాటికి కొత్త పాలక వర్గా లు కొలువుదీరుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణలో సిఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారా న్ని ఆయన ఖండించారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల ఒక నెల ఉందని అప్పటివరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారన్నారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సిఎం ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

నవంబర్ 6 లేదా 7వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో ఈ ప్రత్యేక యాప్‌దే కీలకపాత్ర అని అందుకే ఇంత సమయం పట్టిందన్నారు. ఆధార్‌తో సహా అన్నివివరాలు ఈ యాప్‌లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. నవంబర్ 6 లేదా 7వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి తెలిపారు. నవంబర్ 20వ తేదీ లోపే అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా తయారు అవుతుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీ నుంచి గ్రౌండ్ లోకి వెళ్లి పనులు ప్రారంమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే వారి జాబితాను ఖరారు చేస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలే ఫైనల్ చేస్తాయని, స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన తెలిపారు. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభానికి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందన్న సంకేతాలు తమకు ఉన్నాయన్నారు.

నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తరువాతే….
ఇంట్లోని మహిళల పేరుతోనే ఈ ఇళ్లు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 4 రాష్ట్రాల్లోని ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ఇష్టప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, ఇందులో ఎటువంటి డిజైన్లు ఉండవని మంత్రి చెప్పారు. లబ్ధిదారుల ఇష్టం మేరకు ఇల్లు నిర్మించుకోవచ్చని, కానీ, ఈ ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రతి ఇళ్లు 400 చదరపు అడుగుల పైచిలుకు నిర్మాణం ఉండాలన్న నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని ఆయన తెలిపారు. మొదటిఫేజ్‌లో నాలుగున్నర లక్షల ఇండ్ల పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. తొలి విడతలో సుమారుగా రూ.28 వేల కోట్లు ఖర్చు కావచ్చని ఇప్పటికే బడ్జెట్‌లో సుమారుగా రూ.7,740 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించామని ఆయన తెలిపారు. అవసరమైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతామని, నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, దశల వారీగా లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని మంత్రి తెలిపారు. పునాదికి రూ.లక్ష, గోడలకు రూ.లక్షా 25వేలు, శ్లాబ్‌కు రూ.లక్షన్నర ఇల్లు పూర్తయ్యాక మరో లక్ష రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు మిగతా మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తుందన్నారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల సాయం ఇస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600-ల నుంచి 800 ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని మంత్రి హామీనిచ్చారు.

స్థలాలు లేని వారికి రెండో దశలో…
ఇండ్ల స్థలాలు లేని వారికి రెండో దశలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిస్థలం లేని వారికి 75 నుంచి 80 గజాల స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తామన్నారు. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఇండ్ల నిర్మాణం విషయంలో కేంద్రం ఎంత ఇచ్చినా తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఏమీ ఇవ్వకపోయినా ఇళ్లను నిర్మించి పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి బేషజాలకు పోవడం లేదని, తమకు ఇగోలు లేవని ఆయన పేర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి కేంద్రాన్ని ఇళ్లు అడగలేని ఆయన ఆరోపించారు. నందనవనం, మంకాల్ ఇళ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు.

లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదు
రాష్ట్రంలో ప్రముఖ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మరోసారి స్పందించారు. తాను అన్న బాంబు ఒకటి, రెండు రోజులు ఆటో, ఇటో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది కొరత ఉందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన పేదలకు న్యాయం చేస్తామని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రీన్ చానెల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుందని, లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదని ఆయన పేర్కొన్నారు.

ప్రతి మండలంలో కనీసం ఒక్కరు లేదా ఇద్దరు ఎఈలు
ప్రతి మండలంలో కనీసం ఒక్కరు లేదా ఇద్దరు ఎఈలు ఉండేలా చర్యలు చేపడుతామని మంత్రి పొంగులేటి తెలిపారు. 16 శాఖలకు చెందిన అధికారులను సమీకరించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఒకే గొడుగు కిందకు ఆయా శాఖల ఇంజనీర్లను తీసుకొచ్చి వారి పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. ఇందిరమ్మ కమిటీ అయినా, ఎమ్మెల్యే అయినా లబ్ధిదారుని ఎంపిక ఈఈ నిర్ధారణ చేయాల్సిందే ఈ అధికారులేనని ఆయన వివరించారు.
2004 నుంచి 2014 వరకు 19.36 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో నీళ్లు, కరెంట్, డ్రైనేజ్ లాంటి వసతుల్లేవని ఆయన ఆరోపించారు. తాము అన్నీ వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి 19.36 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News