Monday, January 20, 2025

స్థానిక సమరం మరింత ఆలస్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకావం కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జోష్ మీదున్న కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్సాహం చూపించింది. అందుకు అనుగుణంగా దా దాపు షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోవడం, కులగణన చేపట్టాలనే డిమాండ్‌ల నేపధ్యంలో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వ హాయంలో చేసిన చట్టం ప్రకారం అదే రిజర్వేషన్లతో ఈసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే దీనిపైనా ఇంకా ఎటువంటి కదలిక లేదు. జులై నుంచి ఆగస్టు మధ్య పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం పూర్తి కావాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నధ్ధం అయ్యింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హడావుడి పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎన్నికల సందడి పంచాయతీ ఎన్నికల రూపంలో ప్రారంభం కాబోతోందని రాజకీయ పార్టీలు,

నేతలు భావించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాలుగు నెలల కిందట కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి, కోడ్ ఎత్తివేయగానే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి అప్పట్లోనే తెలిపారు. 2019 జనవరి 21, 25, 30 తేదీలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2024 జనవరి 30తో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఎన్నికలు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో జరగాల్సి ఉండగా ప్రత్యేకాధికారులను నియమించి త్వరలో ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఎమ్మార్వో, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి, ఎండీవో, ఎంపీవో తదితర అధికారులు, లేక వీరికి సమానస్థాయి గెజిటెడ్ అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. గ్రామ కార్యదర్శితో పాటు వీరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల ఏలుబడిలో పంచాయతీలు నెట్టుకొస్తున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పంచాయతీ ఎన్నికలకు నగారా మోగుతుందని భావించారు. రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీలకు, రాష్ట్ర మొత్తం మీద 88,682 పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

ముందుగా అనుకున్నట్లుగా జూన్ మొదటి వారానికి వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. రెండో వారానికి రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. జూలై మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవ్వాల్సి ఉంది. అనంతరం ఆగస్టు 10వ తేదీలోగా ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా రావాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కిందటిసారి ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి ఒకేసారి రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగేవిధంగా ఏర్పాట్లు చేయాలని భావించింది. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం కనిపించడం లేదు. జూన్ 12వ తేదీ దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు బిసి సంఘాలు రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అంతే కాకుండా కులగణన చేపట్టి బిసి జనాభా సంఖ్యను కూడా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. జూన్‌లోనే వార్డుల విభజన, రిజర్వేషన్లు ఖరారైతేనే జూల్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పుడే ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలూ ఆలస్యమే..!
కాగా పంచాయతీ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు కూడా ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. పంచాయతీ ఎన్నికలు జూలై నాటికి పూర్తి చేస్తే ఎంపిటిసి, జడ్‌పిటిసి, ఎన్నికలు కూడా అక్టోబర్, నవంబర నాటికి పూర్తి చేయాలని సంకల్పించింది. పంచాయతీ ఎన్నికలకే ఇంకా కదలిక లేకపోవడంతో మిగిలిన ఎంపిటిసి, జడ్పీపిటిసి ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. గత రిజర్వేషన్లతోనే ఈసారి కూడా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మారడం, బిసి రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల బిసి సంఘాల నుంచి పెద్ద ఎత్తున రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ రావడంతో ప్రస్తుత ప్రభుత్వం డైలమాలో పడింది.

ఈ ఏడాది కూడా బ్యాలెట్ పద్దతిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో మాదిరిగానే వార్డు సభ్యులతా చేతులు ఎత్తి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. స్థానిక ఎన్నికలపై అధికార పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది, ఫలితాలు కూడా ఆ పార్టీకే అనుకూలంగా ఉంటుంటాయి. అయితే ఈ సారి బిఆర్‌ఎస్, బిజెపి కూడా స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తన పూర్వవైభవాన్ని చాటుకునేందుకు పార్టీ పటిష్టం చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయని టిడిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇటీవల ఆ పార్టీ సంకేతాలను పంపించింది. టిడిపి కూడా పోటీలో ఉంటే నాలుగు పార్టీలు స్థానిక ఎన్నికల బరిలో నిలుస్తాయని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News