Friday, November 22, 2024

ఐనవోలు జాతర కు ఘనంగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: మూడు నెలల పాటు జరగనున్న హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతర, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు శాఖల అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ, మండల ప్రజాప్రతినిధులతో మంత్రి దయాకర్‌రావు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతోకలిసి ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన స్వాగత తోరణాన్ని ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంఎల్‌ఎ రమేష్‌లు మాట్లాడుతూ.. జాతర ఏర్పాట్లలో ఎటువంటివ లోటుపాట్లు లేకుండా భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

తాగునీరు, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేయాలన్నారు, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసి, విద్యుత్, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్‌అండ్‌బి, కుడా, ఎక్సైజ్, అగ్నిమాపక, పర్యాటక శాఖల అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ పనులను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా జాతర ఉత్సవాల్లో పారిశుధ్యం, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి వ్యాధులు సోకుండా ఆలయ ప్రాంగణంలో తాగునీరు, క్లోరినేషన్, బ్లీచింగ్, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. జాతర జరగనున్న మూడునెలల పాటు నిరంతరాయ విద్యుత్ ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

జాతర ఆవరణలో ఎక్కడ కూడా మత్తు పానీయాలు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, జాతర ఆవరణలో 24గంటల నిరంతర సిసి కెమెరా నిఘా ఏర్పాటుచేసి ప్రతి నిమిషం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, జడ్పి వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపిపి మార్నేని మధుమతి, మండల ప్రజాప్రతినిధులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News