Wednesday, January 22, 2025

డల్లాస్ లో చంద్రబోస్, ఆర్ పి పట్నాయక్ లకు ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 5వ‌ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వ‌హించారు.

ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా హాజర‌య్యారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ ప్రసాద్ తోటకూర, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కంచర్ల, శారద సింగిరెడ్డి, ప్రకాష్ రావు అతిధులగా వేదికను అలంకరించారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.

ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ కుర్చీల్లో నుంచి కదలకుండా కట్టిపడేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించారు.
చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం మ‌రొక విశేషం. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించారు. ఆయ‌న‌కు, “సుస్వర నాద‌నిధి” ,అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కారం చేయ‌డం జ‌రిగింది. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించ‌డం మెచ్చుకోదగ్గ అంశం. కుమారి సంహితఅనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News