కల్లూరు : హిందువుల తొలి పండుగ పిలువబడే తొలి ఏకాదశి వేడుకలు మండలంలో ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు సమీప వైష్ణవ ఆలయాలకు వేకువ జాము నుండే చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఏకాదశిన పురస్కరించుకొని భక్తజన మండలి ఆఆధ్వర్యంలో ఆలయాలలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు పండుగ విశిష్టతను భక్తులకు వివరిస్తూహిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈపర్వదినంతోనే మన పండగలు మొదలవుతూ వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయన్నారు.
ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని, పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని వివరించారు.
తొలి ఏకాదశి పురస్కరించుకొని దేవాలయాల్లోనూ, ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారని భక్తులకు వివరించారు. తొలి ఏకాదశి పురస్కరించుకొని కల్లూరులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం, షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో గల శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులతో, భజన కార్యక్రమాలతో సందడిగా మారాయి.