Monday, December 23, 2024

యాదాద్రిలో వైభవంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

– నూతన అన్నప్రసాద సత్రం, బంగారు, వెండి నాణేలు, చిరుధాన్యాల ప్రసాద విక్రయం ప్రారంభం
– ఆన్‌లైన్ టికెటింగ్‌కు శ్రీకారం, వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని ఆలయంలో ఆధాత్మిక దినోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మికతను చాటేలా కార్యక్రమాలు చేపట్టగా బుధవారం వేడుకలలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం యాదాద్రికి చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ పరిధిలో నూతనంగా చేపట్టినటువంటి బంగారు, వెండి నాణేల విక్రయం, చిరు ధాన్యాల ప్రసాద విక్రయం, భక్తులకు సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ టికెట్ సేవలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.

ఆలయ ఆవరణలో విక్రయించే 3 గ్రాముల బంగారు డాలరు రూ.21 వేలు, 5 గ్రాముల వెండి డాలరు రూ.1,000 కాగా, 80 గ్రాముల మిల్లెట్ ప్రసాదం రూ.40గా భక్తులకు అందుబాటులో ఉంచారు. అనంతరం కొండకింద వ్రతమండపంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్ రెడ్డ్డి పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అమలవుతున్నటువంటి 2043 ఆలయాలకు ధూపదీప నైవేధ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. నూతనంగా కొత్త ఆలయాలకు అమలైన ధూపదీప నైవేధ్యాల పత్రాలను కూడా మంత్రులు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించినటువంటి అన్నసత్రం, కల్యాణమండపం భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. రాయగిరి సమీపంలో వేద పాఠశాల నిర్మాణం కోసం నూతన భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఆధ్యాత్మికంగా నిరాధారణకు గురైందని విమర్శించారు. సమైఖ్య రాష్ట్రంలో కేవలం 1805 ఆలయాలకు ధూపదీప నైవేధ్యం అమలు చేస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ 6,641 ఆలయాలకు ఈ పథకాన్ని విస్తరించారని అన్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతో యాదాద్రి క్షేత్రం పునర్నిర్మాణాన్ని దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడంతో పాటు, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు సీఎం మంజూరు చేశారని, కామన్‌గుడ్ ఫండ్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా అనేక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆలయాల్లో భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక రూపకల్పనతో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు.

అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారని అన్నారు. ఏసీ గదుల్లో కూర్చొనే కొంతమంది ప్రశిస్తున్నారని అభివృద్ధి ఎక్కడ జరిగిందో సంక్షేమ పథకాలు అక్కడే అమలవుతున్నాయో అక్కడ దశాబ్ధి ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి అన్నారు. గత 9 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి ప్రతిపక్షాల కళ్లకు కనబడడం లేదని అన్నారు. స్వరాష్ట్ర పురోగతిలో కరెంటు కష్టాలు, మంచినీటి కష్టాలు తీరాయని తెలిపారు. ఫ్లోరైడ్ రక్కసి సమస్య నుంచి ఉమ్మడి నల్గొండ నుంచి భయటపడిందని, వ్యవసాయంలో ఘననీయంగా ప్రగతి సాధించామని, సంక్షేమ పథకాల అమలుతో బడుగుబలహీన వర్గాల్లో వెలుగులు నింపాయని అన్నారు.

మంత్రుల వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ చైర్మన్ నర్సింహ్మమూర్తి, ఈవో గీత, ఆలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News