Saturday, November 23, 2024

యాదాద్రిలో పూజ మహోత్సవాల వైభవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనారసింహ నమో నమో అంటూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తులు స్వామి వారి నామస్మరాలు స్మరిస్తూ ప్రత్యేక నిత్య పూజలతో యాదాద్రి ఆలయం పూజ మహోత్సవాల వైభవం కనబడింది. సోమవారం ఏకాదశి పర్వదినం స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి, శివాలయంలో శివుడి ప్రత్యేక పూజలు, ఆలయ నిత్య పూజలతో భక్తులు స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. తెల్లవారుజామున 3 ః 30 గంటలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవ, అర్చన, అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

శ్రీవారి క్షేత్రంలో జరుగు నిత్య కైంకర్య పూజలైన సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడు సేవ, శ్రీ సత్యనారాయణ వ్రత పూజలలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామి ఆలయంలో జరుగు నిత్య పూజలలో పాల్గొన్నారు. పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో అర్చన, అభిషేక, నిత్య కల్యాణం, స్వాతి నక్షత్ర పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజలను నిర్వహించగా భక్తులు పూజలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన……

ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని యాదాద్రి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి లక్ష పుష్పార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ముఖమండపంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ గావించి పరిమిళమైన పుష్పాలతో స్వామి వారికి లక్ష పుష్పార్చన పూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

వైభవంగా స్వాతి నక్షత్రం పూజలు……

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకొని స్వామి వారి ఆలయంలో ఉదయం స్వాతి నక్షత్ర ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అలంకరించి అభిషేకం పూజలను నిర్వహించగా అశేష భక్త జనులు పాల్గొని లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని భక్తులు, స్థానికులు తెల్లవారుజామున నుండే యాదాద్రి కొండకు గిరి పద్రక్షిణ నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు.

అమ్మవారికి ధనుర్మాస పూజలు…….

యాదాద్రి క్షేత్రంలో శ్రీ అండాళ్ అమ్మవారికి ధనుర్మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఆలయ మండపంలోని ఉత్తర భాగంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి ధనుర్మాస పూజ మండపంలో శాస్త్రోక్తంగా తిరుప్పవై పూజ మహోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున 4 ః 30 గంటల నుండి 5 ః 15 గంటల వరకు నిర్వహించిన శ్రీ ధనుర్మాస పూజలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహచార్యులు ధనుర్మాస పూజలు నిర్వహిస్తూ పూజ విశిష్టతను భక్తులకు తెలియచేశారు. పూజలలో పాల్గొన్న మహిళ భక్తులు అండాళ్ అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి దర్శించుకున్నారు.

రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు……

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపైన కొలువుదీరినటువంటి శ్రీ పర్వత వర్ధీణీ రామలింగేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో నిర్వహించినటువంటి శివుడి అభిషేక పూజలు, రుద్ర హోమ పూజలలో భక్తులు, స్థానికులు పాల్గొని శివ దర్శనం చేసుకున్నారు.

నిత్యరాబడి……

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా సోమవారం రోజున 24 లక్షల 66 వేల 376 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ స్వామి వారికి వెండి దీప ప్రమిదలు సమర్పించిన భక్తుడు……

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి నాలుగు వెండి దీప ప్రమిదలను శ్రీనివాసరావు ఉమామహేశ్వరి దంపతులు సమర్పించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అధికారి, అర్చకులకు వెండి దీప ప్రమిదలను అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News