న్యూఢిల్లీ : తనకేదైనా అయితే ఏడవద్దు,కన్నీళ్లు పెట్టుకోవద్దు అని నాయినమ్మ చెప్పిందని రాహుల్ గాంధీ ఆదివారం గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 37వ వర్థంతి సందర్భంగా వెలువడ్డ వీడియోలో రాహుల్ చెప్పిన మాటలు ఉన్నాయి. హత్యకు గురి కావడానికి ముందు రెండు గంటల ముందు ఆమె తనను దగ్గరికి పిలిచి అనుకోనిది ఏదైనా తనకు జరిగితే రోనా నహీ బేటా అని చెప్పారని అప్పటికీ చాలా చిన్నవాడినైన తనకు ఆమె మాటల అర్థం తెలియలేదన్నారు. ఆమె చివరి మాటల తరువాత రెండు మూడు గంటలకు నివాస ప్రాంగణంలోనే దారుణరీతిలో అక్కడి అంగరక్షకుల కాల్పులకు బలి అయ్యారు. 1984లో ఈ దారుణం జరిగింది. నాయినమ్మ అంత్యక్రియలు తన జీవితంలో తనకు అత్యంత గడ్డు పరిస్థితి రోజని రాహుల్ మననం చేసుకున్నారు.
హత్యకు గురవుతానని ఇందిరాజీ ముందుగానే పసికట్టి ఉంటారని, అంతిమ గడియల దశలో ఆమె చెప్పిన మాటలు తనకు ఇప్పటికి గుర్తుకు వస్తుంటాయని తెలిపారు. ఓసారి డైనింగ్ టేబుల్ వద్ద ఆమె మాట్లాడుతూ వ్యాధికి గురై మరణించడం కన్నా శాపం మరోటి ఉండదని అన్నారని తెలిపారు. ప్రియమైన నానమ్మ ఇందిరాజీకి ప్రేమాదరాభిమానాలతో ఈ జ్ఞాపకం పేరిట ఈ వీడియో రూపొందింది. ఈ వీడియోలో ఇందిర అంత్యక్రియల ఘట్టం కూడా ఉంది. ఈ దశలో నానమ్మ భౌతిక కాయాన్ని చూస్తూ చిన్నవాడైన రాహుల్ వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇందిర వర్థంతి సందర్భంగా రాహుల్ ఇతర నేతలు ఇక్కడి శక్తిస్థల్ వద్ద ఇందిర సమాధిపైపుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.