వనపర్తి టౌన్ : జిల్లా కేంద్రంలో హిందూ స్మశాన వాటికను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని హిందూ వాహిని వారు కోరారు. సోమవారం హిందు వాహిని ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ఆర్టీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ మాట్లాడుతూ గతంలో ఉన్న కలెక్టర్‌కు, ఉన్నత అధికారులకు ఎన్నో సార్లు స్మశాన వాటిక అభివృద్ధి గురించి విన్నవించుకోవడం జరిగింది కాని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో ఉన్న స్మశాన వాటిక ము ళ్ళ చెట్లలతో చాలా అద్వానంగా మారిందన్నారు. ఒక వైపు స్థలం సరిపోకపోవడం వల్ల గుంతలో ఉన్న శవ ఎముకలని తీసి అదే గుంతలో ఇంకో శవాన్ని పుడుస్తున్నారన్నారు. అంతే కాకుండా జిల్లా కేంద్రంలో ఒక్క బర్నర్ మిషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్మశాన వాటికలో కనీస వసతులైన త్రాగు నీళ్లు, వీధి లైట్లులు ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు.
హిందూ శ్మశాన వాటిక కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసిన నాణ్యతలేని నిర్మాణాలు కట్టి ప్రారంభానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్మశాన వాటికకు ఇంకా 5 ఎకరాలలో స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలని హిందూ వాహిని జిల్లా శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యయన్ ప్రముఖ్ నరేష్, మీడియా ఇంచార్జీ హర్షగౌడ్, హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.