గుదిబండగా మారిన డీజిల్ ధరలు
చార్జీలను పెంచక పోతే మరింత నష్టం
అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగాజారి పోతుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్‌టిసిలో సమ్మె మొదలు, కరోనా మొదటి దశ, రెండో దశలతోనే కాకుండా రెండు నెలలుగా డిజిల్ ధరలు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సంస్థ కనీసం సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎదుర్కొంది. గత సంవత్సరంలో లాక్‌డౌన్ కారణంగా సంస్థ భారీ నష్టాల చవిచూసింది. కరోనాతో గ్రేటర్‌లో ఆర్‌టిసికి సుమారు రూ.1000 కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 డిపోల ద్వారా 2500 బస్సులతో సుమారు 7 లక్షల కిలో మీటర్లు తిరుగుతూ 20 నుంచి 25లక్షల మందికి ప్రయాణికులను గ్యమస్థానాలకు చేరుస్తున్నాయి.
గ్రేటర్ ఆర్‌టిసి అధికారులు పరిపాలనా సౌలభ్యంగా కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ రిజియన్లుగా ఏర్పాటు చేశారు.హైదరాబాద్ రీజియన్‌లో సికింద్రాబాద్ రీజియన్‌లో 12 డిపోలు ఉండగా, హైదరాబాద్ రీజియన్‌లో 17 డిపోలు ఉన్నాయి. లాక్‌డౌన్ విధించక ముందు సంస్థకు రోజుకు రూ. 3 నుంచి 3.50 కోట్ల ఆదాయం ప్రయాణికులు రవాణాద్వారా సమకూరేది. లాక్ డౌన్‌లో నిబంధనల కారణంగా ఉదయం 6 గంటల నుంచి 10 సడలింపుతో రోజుకు సంస్థకు రూ.20 నుంచి 25లక్షల మాత్రమే ఆదాయం వచ్చింది. అనంతరం సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 1 వరకు సడలించడంతో 60 నుంచి 65 లక్షల ఆదాయం సమకూరేది. గతంలో ప్రతి ఏటా సంస్థకు రూ.350 కోట్ల నష్టం వాటిల్లింది. లాక్‌డౌన్‌తో కారణంగా ప్రయాణికులు సంఖ్య పూరింతగా పడిపోయింది. ప్రతి నెలా స్బిందికి వేతనాలు రూ.90 కోట్లు ఉండగా లాక్‌డౌన్ విధించడంతో బస్‌పాస్‌లు తీసుకుంటే నష్టం వాటిల్లింది. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు.
పెరిగిన డీజిల్ ధరతో మరింత భారం
అసలే ఆర్‌టిసి ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో డీజిల్ ధర లీటర్ రూ.88.86 ఉండగా అది ప్రస్తుతం లీటర్ రూ: 97.96కు చేరింది. గ్రేటర్‌లో బస్సులను నడిపేందుకు ప్రతి రోజు సుమారు 1.25 లక్షల డీజిల్ వినియోగం జరుగుతుంది. గత ఆరు నెలల్లోనే వరుసగా డిజిల్ ధర రూ.11 పైగా పెరగడంతో దాని భారం సంస్థపై పడింది. సంస్థలో ఉన్న 2500 బస్సుల్లో సుమారు 1000 బస్సల వరకు కాలం చెల్లినవే. ఇటువంటి పరిస్థితుల్లో కెఎల్‌ఎంపి పెరగడం ఏ మాత్రం సాధ్యం కాదు. మంచి కండీషన్‌లో ఉన్న బస్సు ట్రాఫిక్, రోడ్ల స్థితిగతులను బట్టి ఒక లీటర్ డీజిల్‌కు సుమారు 5 నుంచి 7 కిలో మీటర్లు మాత్రమే వస్తుంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఒక లీటర్ డిజిల్‌లో 4 నుంచి 5 కిలోమీటర్లు రావడమే గగనం. దీంతో వాటి భారం కూడా సంస్థపై పడుతోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా డిజిల్ ధరలు పెరుగుతున్నా బస్‌చార్జీలను మాత్రం పెంచక పోవడంతో పరిస్థితి మరింత దిగజారడానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థలో కొత్త బస్సులను కొనలేని పరిస్థితి నెలకొంది. సంస్థ ఆర్దిక నష్టాల నుంచి బయటపడాలంటే బస్‌చార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.