కెటిఆర్ అరెస్టుపై నేనేం చెప్పలేను ప్రధాన
కుంభకోణాలు ప్రజల ముందుకు తెస్తాం ఐఎఎస్
అధికారి అర్వింద్ కుమార్‌పై విచారణకు
ప్రభుత్వం అనుమతిచ్చింది మొదటిదశలో
ముగ్గురు నుంచి నలుగురితోపాటు ఏజెన్సీలపైనా
కేసులు ఎసిబి దగ్గర అన్ని సమాధానాలున్నాయి
మావి తుస్సుబాంబులు అయితే మీ ఢిల్లీ
ప్రదక్షిణలు ఎందుకు? అసెంబ్లీలో బిఆర్‌ఎస్
నేతలు గుండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు
మీడియాతో మంత్రి పొంగులేటి చిట్‌చాట్
మన తెలంగాణ/హైదరాబాద్: ఈకార్ రేసు అవినీతి వ్యవహారంపై విచారణకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చిందని, దానిపై దర్యాప్తు చట్టప్రకారం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. న్యా య నిపుణుల సలహాతో గవర్నర్ అనుమతి ఇచ్చారని, నేడో, రేపో సిఎస్ ద్వారా ఎసిబికి పంపిస్తామని వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం సాయం త్రం అసెంబ్లీ హాల్‌లో మంత్రి పొంగులేటి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. ఈ కార్ రేస్‌లో ఐఏఎస్ అరవింద్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, మాజీ మంత్రి కెటిఆర్ అరెస్టుపై తానేమీ వ్యాఖ్యానించబోనని ఆయన తెలిపారు. ఈ కారు రేస్‌లో మొదటి వి డతలో ముగ్గురి నుంచి నలుగురు ఉన్నారని, ఏజెన్సీల మీద కూడా కేసులు అవుతాయని, ఈ కారు రేస్‌లో పెద్ద మొత్తంలో చేతులు మారాయని మంత్రి ఆరోపించారు.
కొంతమంది అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతున్నారని, ఈ కారు రేస్‌లో జరిగిన దోపిడీ, వారి స్వలాభం కోసం చేసిన పనులపై తాము కేబినెట్‌లో చర్చించామన్నారు. ఈ కారు రేస్ అవినీతిపై ఏసిబి దగ్గర సమాధానం ఉందని ఆయన అన్నారు. తీగ లాగితే డొంక కదులుతుందని ఆయన పేర్కొన్నారు. తాము అన్నది తుస్సు బాంబులు అయితే బిఆర్‌ఎస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి ఎందుకు వెళుతున్నారని, వారు ఎందుకు భయ పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సభలో బిఆర్‌ఎస్ నాయకులు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారన్నారు. వారికి డిబెట్ చేసే ధైర్యం లేకనే ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి వస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు తరువాత పాదయాత్ర చేస్తారా మోకాళ్ల యాత్ర చేస్తారా వాళ్ల ఇష్టమని మంత్రి ఎద్దేవా చేశారు. విద్యుత్ కమిషన్‌పై సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయని ఆయన తెలిపారు. కేబినెట్ భేటీలో కొన్ని బిల్లులపై చర్చించామని మంత్రి తెలిపారు. ఈ సమావేశాల్లో ఆర్‌ఓఆర్ బిల్లును ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.