ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు
ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఐదు నిర్మాణాలు గ్రీన్ యాపిల్ అవార్డులను గెలుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ అవార్డులను లండన్‌లో అందుకున్నారు. సచివాలయం, మొజాంజాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయానికి గ్రీన్ యాపిల్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ కేటగిరి కింద ఈ అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనత. ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పట్టాయి. రాష్ట్రానికే ఇప్పటికే వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు (2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్(2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డు, స్మార్ట్‌సిటీ ఎక్స్‌ఫో వరల్డ్ కాంగ్రెస్(2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకుంది.
ప్రతి రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా
లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రిల్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. ఇప్పుడు ఈ సంస్థ తెలంగాణ కట్టడాలకు అవార్డులను ఇచ్చింది. ఈ అవార్డులు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 9 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘనతను సాధించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటై అన్నిరంగాల్లో అనేక మార్పులు తీసుకువస్తూ దేశంలోనే ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఉంటూ దిక్సూచిలా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులతో పాటు స్వచ్ఛ అవార్డులు, ఉత్తమ గ్రామ పంచాయతీలు అనేక అవార్డులు గెలుచుకుంటూ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎదుగుతూ ముందంజలో ఉందని ప్రభుత్వం తెలిపింది.