Thursday, January 23, 2025

విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన హరితహారం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : పుడమి పులకరించేలా ప్రకృతి పరవశించేలా హరితహారం పథకం రాష్ట్రంలో విప్లవాత్మమైన మార్పును తీసుకొచ్చిందని, రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అడవుల పునర్ నిర్మాణ ఎజెండాను భుజానికి ఎత్తుకుని విజయవంతంగా అమలు చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం హరితోత్సవం సందర్భంగా ఖమ్మం నగరం ఎల్బీ నగర్ లోని ఎన్‌ఎస్పి కెనాల్ వాక్ వే గట్టు పొడవునా 5 వేల మొక్కలు నాట తలపెట్టిన కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజలు మొక్కలు నాటి ప్రారంభించారు.

అనంతరం వెలుగుమట్ల అర్బన్ పార్క్ నందు అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం పచ్చలహారంలా మారాలనే ఉద్దేశంతోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందని, కోట్ల చెట్లు నాటడం వల్లే నేడు ఈ మాత్రం పర్యావరణం ను కాపాడుకున్నామని లేనిచో మనం తీవ్ర ప్రమాదంలో పడే వారమని అన్నారు. వాతావరణ సమతుల్యం సరిగా లేక, సకాలంలో వర్షాలు పడక పర్యావరణం ప్రమాదంలో పడిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అడవులు 6 శాతం పెరిగాయన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి మనిషికి 422 చెట్లు ఉన్నాయన్నారు. ఇండియాలో ప్రతి మనిషికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని మంత్రి అన్నారు. చెట్లను కన్న పిల్లలు లాగా చూసుకోవల్సిన బాధ్యత మనపై ఉందని, చెట్లే ఈ సృష్టికి జీవనాధారం అని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఅర్ హరితహారం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రతి ఏడాది ప్రతి ఒక్క పౌరులను భాగస్వాములను చేసి ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కలు విజయవంతంగా నాటారని ఆయన తెలిపారు. రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్చమైన గాలిని, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది అని ఆయన అన్నారు.

అట్టి కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు ఆకు పచ్చగా పరుచుకున్నాయని, ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సీజన్ తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలని, ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటాడంజరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు చేశామని, హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల ఖర్చు చేశామన్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం 2015-21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగిందని వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 9 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా పచ్చని తెలంగాణ లక్ష్యంగా కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు.

సామాజిక బాధ్యత తోనే కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. ఇండ్లలో, పార్కుల్లో, గ్రామాల్లో, పొలాల్లో అనేక మొక్కలు నాటినట్లు, వీటిని రక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్, ఇల్లందు మునిసిపాలిటీలకు అవార్డులు వచ్చాయని, ఈరోజు రఘునాథపాలెం గ్రామ పంచాయతీకి అవార్డు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఒక మొక్కను పెంచాలన్నారు. జిల్లాకు చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మురికికూపంలా ఉన్న గోళ్లపాడు ప్రాంతాన్ని 11 పార్కులతో సుందరంగా, ఆహ్లాదకరమైన ప్రాంతంగా చేసినట్లు, ఒకప్పుడు దుర్గంధభరితమైన ప్రాంతంగా ఉన్న లకారం ఇప్పుడు నగరంలో ఎంతో విలువైన ప్రాంతంగా మారిందన్నారు.

జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 7 శాతం గ్రీన్ కవర్ పెరిగినట్లు ఆయన అన్నారు. దేశంలో అత్యధిక శాతం గ్రీన్ కవర్ పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. హరితోత్సవం నాడు 2.50 లక్షల మొక్కలు నాటడానికి కార్యాచరణ చేసినట్లు, వర్షాలు పడకపోవడంతో, ప్రస్తుతానికి 60 వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 30 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా ఉన్నట్లు, నర్సరీల్లో 60 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు ఆయన అన్నారు. ఈ సదర్భంగా 2023 నర్సరీ డైరెక్టరీని ఆవిష్కరించారు. విశిష్ట సేవలు అందించిన అటవీ శాఖ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, స్థానిక కార్పొరేటర్ రావూరి కరుణ, రఘునాథపాలెం జెడ్పిటిసి ప్రియాంక, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News