మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/జగిత్యాల/మల్యాల: మూడు మొ క్కలతో ప్రారంభమైన ‘గ్రీన్ ఇండి యా ఛాలెంజ్’ ప్రజా భాగస్వామ్యం తో ఐదేండ్లలో ఇప్పుడు మహా ఉద్యమంగా మారిందని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త, ఎంపి సంతోష్ కుమార్ అన్నారు. శనివారం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లతో కలిసి కరీంనగర్ ఎల్‌ఎండి సమీపం వద్ద రాశి ఆయన మొక్కలు నాటారు. అనంతరం కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసన సభ్యులు సుంకే రవి శంకర్‌లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తద్వారా తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దత్తత తీసుకొని రూ. 1.04 కోట్లు ఎంపి లాడ్స్‌తో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపి సంతోష్ మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెట్టిందని అన్నారు. ఆరవ విడతలో పచ్చదనం పెంపు, ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణ, అవగాహనపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల కాలంలో లక్షలాది మొక్కలను నాటి, వాటిని సంరక్షించామన్నారు. మొక్కలకు నాటుతూ పచ్చదనాన్ని పెంచుతున్న ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు’ అని సంతోష్ అన్నారు. కరీంనగర్ రాశివనంలో మొక్కను నాటడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కరీంనగర్‌లో పచ్చని మొక్కలతో అలరారుతున్న రాశివనం అద్భుతంగా ఉందన్నారు. పిచ్చి మొక్కలతో ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని పచ్చని మొక్కలతో తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిష్ఠాత్మకంగా హరిత విప్లవం : రాష్ట్ర బీసీ పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్
భావితరాలకు ఆస్తి ఇస్తే కరిగిపోతుందని, వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపి సంతోష్ కుమార్ ప్రతిష్ఠాత్మకంగా హరిత విప్లవాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర బిసి పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటారన్నారు. సమైక్య పాలనలో వనాలులేక కరీంనగరం కాంక్రీట్ జంగిల్‌గా మారిందని, కానీ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు స్వయం పాలనలో కరీంనగర్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని ఇప్పటివరకు 9 నుంచి 10 లక్షల మొక్కలు నాటామని,
మొత్తం 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఎంపి సంతోష్ కుమార్ చిన్నారుల్లో సైతం స్ఫూర్తిని నింపుతున్నారని, మనం కాపాడే నీళ్లు, వనాలు, భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని అన్నారు. ఎల్‌ఎండిలోని ఎస్సారెస్పీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటామని ఇప్పటివరకు నాటిన మొక్కలు వృక్షాలుగా మారాయని అన్నారు. ఇవి భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇస్తాయని అని, ఎంపి సంతోష్ కుమార్ కరీంనగర్‌లో మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రం అత్యద్భుతం : రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కొండగట్టు అంజనేయ క్షేత్రం అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అటవీ, దేవాలయాల ప్రేమికులుగా ఎంపి సంతోష్ కుమార్ సిఎంకు తోడ్పాటుగా ఒక కోటి 4 లక్షల రూపాయలతో కొండగట్టు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అటవీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుండడంతో ఈ అటవీ ప్రాంతం దట్టమైన అటు ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కొండగట్టు అటవీ క్షేత్రం నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు సరిపడా ఆక్సిజన్ అందుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో 265 కోట్ల మొక్కలను ఇప్పటి వరకూ నాటారాని అన్నారు. తెలంగాణలోని అన్ని పల్లెలు, పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని తెలిపారు.
ఎంపి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గ బిడ్డగా ఎంపి సంతోష్ కుమార్ ఈ నియోజకవర్గ పరిధిలోని కొండగట్టు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దత్తత తీసుకొని అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గొప్ప విషయమని అన్నారు. ఎంపి సంతోష్ కుమార్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
అంతకుముందు కొండగట్టు ఆంజనేయస్వామిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌రావు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, సంజయ్ కుమార్‌లతో కలిసి దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొక్కలు నాటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త
కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్‌లో పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్ మొక్కలు నాటడంతోపాటు వాచ్‌టవర్ ఎక్కి విత్తన బంతులను విసిరారు. అనంతరం కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్‌లోని వాష్ టవర్ పైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించారు. సుమారు అరగంటకు పాటు వాచ్ టవర్ పైనే గడిపారు. ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్‌తో సీతాఫల విత్తనాలతో తయారు చేసిన అటవీ బంతులను విసిరారు. వివిధ చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ .వి. కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్, జడ్పీ సీఈఓ ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.