మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని బంజారా హిల్స్ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందఫ్భంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సహ వ్యవస్థాపకులు కరుణాకర్, రాఘవ ఇతర సభ్యులు పాల్గొన్నారు. మర్రి, రావి, చింత వంటి మొక్కలను నాటడం ద్వారా వేగంగా పెరిగి వివిధ జాతుల పక్షులు, జంతువులకు నీడ, ఆశ్రయం కల్పిస్తాయి. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రారంభం నుండి ఇప్పటివరకూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి గణనీయమైన అభివృద్ధిని సాధిం చింది. దేశవ్యాప్తంగా అనేక రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.