Sunday, November 17, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కను నాటిన ప్రకాశ్ అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బిఆర్.అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. శుక్రవారం బేగంపేటలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా ప్రకాశ్ అంబేద్కర్ మొక్కను నాటారు. ‘మనుషుల్లో సమానత్వం ప్రకృతి సమతూల్యత’ కోసం పరితపించిన మా తాత డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా తాతగారు తాను ‘కేంద్ర న్యాయశాఖ మంత్రి’గా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఒక్క మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని కోరుకున్నారు.

Also read: వరికోత మిషన్ అదుపుతప్పి..

మొక్కలు నాటడం పట్ల వారికి అమితమైన ఆసక్తి ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌”లో చూస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ కృషి అనితర సాధ్యమైనది. ఈ మధ్యలోనే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లిమ్కాబుక్‌లో చేరడం నాకు చాలా ఆనందం కలిగించింది. వారి కృషికి మరింత గుర్తింపు రావాలి. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోష్‌కు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా’నన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News