గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విత్తన బంతులు విసిరిన విద్యార్ధులు
మన తెలంగాణ/హైదరాబాద్ : పిల్లలకు విద్యా, వికాసంతో పాటు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం మనందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం గండిపేటలోని పల్లవి పబ్లిక్ స్కూల్ లో టివి9 ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పాఠశాల విద్యార్ధులు విత్తన బంతులు చేసి విసిరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోగినపల్లి సంతోష్ కుమార్ విద్యార్ధులతో కలిసి పోయి, మట్టి, విత్తనాలను కలిపి స్వయంగా విత్తన బంతులను తయారు చేసి విద్యార్ధుల్లో స్పూర్తి నింపారు. అనంతరం విద్యార్ధులతో కలిసి మొక్కలు లేని ఖాళీ ప్రదేశంలో ఈ విత్తన బంతులను విసిరేసి విద్యార్ధుల్లో ఉత్సాహం నింపారు.
అనంతరం ఎంపి సంతోష్ మాట్లాడుతూ ప్రయత్నం చిన్నదా, పెద్దదా అన్నది విద్యార్ధులు ఆలోచించవద్దని చిన్న ప్రయత్నం జీవితంలో పెద్ద విజయాలను అందిస్తుందని చెప్పారు. దానికి నిలువెత్తు నిదర్శనం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఆయన తెలిపారు. ఒక్క మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లవి స్కూల్ ఛైర్మన్ కొమురయ్య, డైరెక్టర్ యసస్వీ, టీవీ9 ప్రతినిధులు సత్య , రాకేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మెంబెర్స్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.